తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జంట నగరాల పరిధిలో పటిష్ట పోలీసు వ్యవస్థను ఏర్పాటు చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. హైదరాబాద్ – సికింద్రాబాద్ జంట నగరాల పరిధిలో ప్రభుత్వం కొత్తగా 40 పోలీస్‌స్టేషన్లను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే, కొత్తగా 6 డీసీపీలను నియమిస్తూ ఉన్నతాధికారులు జీవో జారీ చేశారు. హైదరాబాద్‌లో 12 మంది ఏసీపీ డివిజన్లు ఏర్పాటు చేయగా.. సైబరాబాద్‌లో 3 డీసీపీ జోన్లు ఏర్పాటు చేయనున్నారు.
ప్రతి జోన్‌కు మహిళా పోలీస్‌స్టేషన్ ఏర్పాటు చేయనున్నారు. కొత్తగా 11 లాఅండ్‌ఆర్డర్, 13 ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లతో పాటు.. ప్రతి ఏరియాలో సైబర్ క్రైమ్, నార్కొటిక్ వింగ్ ఏర్పాటు చేయనున్నారు. కొత్తగా 2 టాస్క్‌ఫోర్స్ జోన్లు కూడా ఏర్పాటు చేయనున్నారు. సైబరాబాద్‌లో మేడ్చల్, రాజేంద్రనగర్ జోన్‌లు, రాచకొండలో మహేశ్వరం జోన్ ఏర్పాటు చేయనున్నట్లు జీవో జారీ చేశారు.









