లిక్కర్ స్కాంలో సెన్సేషన్ గా మారిన సుఖేష్ చంద్రశేఖర్.. తాజాగా మరో లేఖ విడుదల చేశారు.ఈ సారి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పై తన న్యాయవాది అనంత్ మాలిక్ ద్వారా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కు లేఖ పంపించారు సుఖేష్. అరవింద్ కేజ్రీవాల్ నివాసానికి సంబంధించి విలువైన ఫర్నీచర్ పై విచారణ చేయాలని లేఖలో కోరారు. కేజ్రీవాల్ లక్షల విలువ చేసే ఫర్నీచర్ వాడుతున్నారని.. అవి ఆయన ఇటలీ, ఫ్రాన్స్ నుంచి తెప్పించుకున్నారని.. వాటిని రిషబ్ షెట్టి కేజ్రీవాల్ నివాసానికి తరలించారని లేఖలో పేర్కొన్నారు.
వాట్సాప్, ఫేస్ టైం చాట్లలో, తాను పంపించిన ఫోటోల ఆధారంగా.. అరవింద్ కేజ్రీవాల్, సత్యేంద్ర జైన్ ఫర్నీచర్ సెలెక్ట్ చేశారని చెప్పారు. అంతేకాకుండా ఇంట్లో ఏ సామాగ్రి ఉంది.. వాటి విలువ ఎంత ఉంటుందో కూడా పూర్తి వివరాలు వెల్లడించారు. రూ. 45 లక్షల విలువైన డైనింగ్ టేబుల్, రూ. 34 లక్షల విలువైన డ్రెస్సింగ్ టేబుల్స్ ,రూ. 18 లక్షల విలువైన అద్దాలు, రూ. 28 లక్షలు విలువచేసే బెడ్ రూమ్ సామాగ్రి, రూ. 45 లక్షలు విలువచేసే వాల్ క్లాక్స్ ఉన్నాయని తెలిపారు. వాటన్నీటిని పరిశీలిస్తే కేజ్రీవాల్ కు లగ్జరీ లైఫ్ పై ఎంత మక్కువ ఉందో అర్థమవుతుందని అన్నారు. తాను గతంలో దర్యాప్తు సంస్థకు ఇచ్చిన బిల్లులతో.. ఫర్నీచర్ ఖర్చుని పోల్చి విచారణ చేయాలని కోరారు.
కేవలం ఫర్నీచర్ కాకుండా వెండి వస్తువులు కావాలని కేజ్రీవాల్ తనను కోరారని, ఆయన కోసం రూ. 90 లక్షల విలువైన వెండి వస్తువులను కొనుగోలు చేశానని చెప్పుకొచ్చారు. దక్షిణ భారత్ కు చెందిన ఓ ప్రముఖ బంగారపు షాపులో ఈ వస్తువులను కొనుగోలు చేశానని.. కిక్ బ్యాక్ కరోల్ బాగ్ అనే ప్రాజెక్టు కింద ఈ వస్తువులను కొనుగోలు చేశానని వెల్లడించారు. ఇందులో 15 వెండి భోజనం ప్లేట్లు, 20 గ్లాసులు, వెండి గిన్నెలు, స్పూన్లు, వెండి విగ్రహాలు కొనుగోలు చేశానని.. తాను విడుదల చేసిన ఈ వివరాలపై ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీతో దర్యాప్తు చేయాలని కోరారు.









