విద్యార్థులకు, నిరుద్యోగులకు తాము ఉన్నామని చెప్పడానికి ప్రియాంక గాంధీ తెలంగాణకు వస్తున్నారని.. నిరుద్యోగుల పట్ల తెలంగాణ ప్రభుత్వ తీరును ఎండగట్టేందుకే యువ సంఘర్షణ సభ నిర్వహిస్తున్నామని ఏఐసీసీ ఇంచార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే తెలిపారు. సరూర్ నగర్ స్టేడియంలో ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. నిరుద్యోగులకు భరోసా కల్పించి,వారిలో నమ్మకాన్ని కలిగించేందుకు ప్రియాంక గాంధీ వస్తున్నారని, ప్రియాంక గాంధీ సభను విజయవంతం చేయాలని కోరారు.కర్నాటకలో ఓడిపోతామన్న భయంతోనే బీజేపీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల వద్ద నిరసనలు చేస్తుందని విమర్శించారు. ఇలాంటి పోకడలు తెలంగాణ రాజకీయ సంస్కృతికి మంచిదా?అని ప్రశ్నించారు. బండి సంజయ్, కిషన్ రెడ్డికి విజ్ఞప్తి చేస్తున్నానని.. ఇలాంటి చర్యలతో గౌరవం పోగొట్టుకోవద్దని సూచించారు.









