మేడ్చల్ జిల్లా ఘాట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధి కొండాపూర్ గ్రామంలో అదృశ్యమైన బాలుడు మ్యాన్ హోల్ లో శవమై తేలాడు. రెండు రోజుల 12 ఏళ్ల బాలుడు సంతోష్.. వర్షంలో బయటకు వెళ్లి ఇంటికి తిరిగిరాలేదు. కుటుంబ సభ్యులు ఎంత వెతికినా దొరక్కపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలుడి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. డీఆర్ఎఫ్ టీం, గజ ఈతగాళ్లతో బాలుడి కోసం విస్తృతంగా గాలించారు.వర్షం రావడం కంటే ముందు సంతోష్ బట్టలు ఉతికేందుకు వెళ్లిన మంగలి గుట్ట చెరువంతా జల్లెడ పట్టారు. చివరకు ఈ రోజు ఆ చెరువు పక్కనే ఉన్న వాసవి వెంచర్ లోని ఓ మ్యాన్ హోల్లో బాలుడి మృతదేహం లభ్యమైంది. అయితే బాలుడి మరణంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సంతోష్ ని ఎక్కడో చంపి ఈ మ్యాన్ హాల్లో పడేశారా..? లేక ప్రమాదవశాత్తు మ్యాన్ హోల్ లో పడిపోయాడా..? అనేది సస్పెన్స్ గా మారింది. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.









