హుస్సేన్ సాగర్ ఒడ్డున తెలంగాణ రాష్ట్రప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న తెలంగాణ అమరవీరుల స్మారకం ప్రారంభోత్సవానికి సిద్ధమవుతుంది. వచ్చే నెలలో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్ర రోడ్లు,భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్మారకం నిర్మాణ పనులను పరిశీలించారు.నిర్మాణ ప్రాంగణమంతా కలియ తిరుగుతూ పనులను పరిశీలించారు.
ప్రధాన ద్వారం, ల్యాండ్ స్కేప్ ఏరియా, పార్కింగ్ ఏరియా, తెలంగాణ తల్లి విగ్రహం, ఫౌంటైన్ ఏరియా, గ్రానైట్ ఫ్లోరింగ్, ఫోటో గ్యాలరీ, ఆడియో, విజువల్ రూం, లిఫ్ట్ లు, ఎస్కలేటర్, కన్వెన్షన్ సెంటర్, పై అంతస్థులో రెస్టారెంట్, నిరంతరం జ్వలించే జ్వాలలా ఉండే జ్యోతి ఆకృతి ఇలా అన్ని రకాల పనులను పరిశీలించారు. అధికారులకు, నిర్మాణ సంస్థకు పలు సూచనలు చేశారు. ల్యాండ్ స్కేప్ ఏరియాలో పచ్చదనానికి ప్రాముఖ్యతనివ్వాలన్నారు. ఆహ్లాదకరమైన రంగురంగుల పూల మొక్కలు ఏర్పాటు చేయాలని సూచించారు. నిర్మాణ ఫినిషింగ్ పనుల్లో వేగం పెంచాలని, నిర్ణీత గడువులోగా ప్రారంభానికి సిద్దం చేయాలని అదేశించారు.
తెలంగాణ అమరవీరుల త్యాగాలు ప్రతిబింబించేలా.. ముఖ్యమంత్రి కేసిఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ నిర్మాణం చేపట్టారని మంత్రి అన్నారు. ప్రపంచంలోనే అరుదైన స్టెయిన్ లెస్ స్టీల్ తో నిర్మించిన అతిపెద్ద కట్టడం ఇదేనని తెలిపారు. అన్ని రకాల అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో, సకల హంగులతో స్మారకాన్ని నిర్మిస్తున్నామని చెప్పారు.ఈ నిర్మాణం పూర్తి అయి అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రపంచమే అబ్బురపడి చూస్తుందన్నారు. స్మారక ప్రాంగణానికి ఎవరు వచ్చినా అమరవీరుల త్యాగాలు గుర్తు చేసుకునే విధంగా నిర్మాణం ఉండబోతుందని తెలిపారు.ఇది పూర్తిగా యావత్ తెలంగాణ ప్రజల హృదయాలను హత్తుకునే కట్టడమని.. ప్రతి ఒక్కరూ మనసుపెట్టి పనిచేయాలని అధికారులను, వర్క్ ఏజెన్సీని కోరారు.










