ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద విధులు నిర్వర్తించే ట్రాఫిక్ కానిస్టేబుళ్లకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. ఎండ నుంచి రక్షణ కోసం ఏసీ హెల్మెట్లు అందించాలని నిర్ణయించింది. ఇటీవల ప్రయోగాత్మకంగా కొంతమంది ట్రాఫిక్ కానిస్టేబుళ్లకు వీటిని అందించారు. వీటి పనితీరు, కానిస్టేబుళ్లకు ఉపయోగపడుతున్న తీరును పరిశీలించిన తర్వాత మిగతా ట్రాఫిక్ కానిస్టేబుళ్లు అందరికీ ఇవ్వనున్నారు. ఈ ఏసీ హెల్మెట్లను ప్రత్యేకంగా ట్రాఫిక్‌లో విధులు నిర్వర్తించే కానిస్టేబుళ్ల కోసమే తెలంగాణ పోలీస్ శాఖ ఇటీవల తయారుచేయించింది.
వారం రోజుల క్రితం రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ ఎల్బీనగర్‌లోని తన క్యాంపు కార్యాలయంలో కొంతమంది ట్రాఫిక్ సిబ్బందికి ఏసీ హెల్మెట్లను అందించారు. ప్రస్తుతం వీటి పనితీరును పరిశీలిస్తున్నారు. త్వరలో అందరికీ వీటిని ఇచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ఏసీ హెల్మెట్‌కు అరగంటపాటు ఛార్జింగ్ చేస్తే మూడు గంటల పాటు ఉంటుంది. బ్యాటరీ ఆధారంగా ఈ ఏసీ హెల్మెట్ పనిచేసేలా అభివృద్ధి చేశారు. ఈ హెల్మెట్‌కు మూడు వైఫుల నుంచి గాలి వచ్చేలా రూపొందించారు. ముఖానికి, హెల్మెట్ లోపల.. ఇలా మూడు వైపుల నుంచి చల్లని గాలి వీస్తుంది.









