ఓఆర్ఆర్ టెండర్, హైదరాబాద్ లో అధికారం మాటున జరుగుతున్న భూకబ్జాలపై కీలక వ్యాఖ్యలు చేసిన టీపీసీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డి.. సీఎం కేసీఆర్ పై మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. గాంధీభవన్ వేదికగా.. పలు విషయాలను వెల్లడించారు. తెలంగాణ మోడల్ కు ఆకర్షితులై మహారాష్ట్ర నేతలు బీఆర్ఎస్ లో చేరుతున్నారని కేసీఆర్ ప్రచారం చేసుకుంటున్నారని.. అయితే ఈ చేరికల చాటున మహారాష్ట్రకు చెందిన వారిని అధికారులుగా నియమించుకున్నారని ఆరోపించారు. మహారాష్ట్రకు చెందిన శరద్ మడ్కర్ అనే వ్యక్తి ఐటీ ఉద్యోగం వదిలేసి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై బీఆర్ఎస్ లో చేరారని ప్రచారం చేసుకున్నారని.. కానీ శరద్ మడ్కర్ ను బీఆర్ఎస్ లీడర్ అని చెప్పుకుంటూ కేసీఆర్ కు పర్సనల్ సెక్రటరీగా నియమించుకున్నారన్నారు.
ఏప్రిల్ 10న బీఆర్ఎస్ లో చేరిన శరద్ మడ్కర్ ని.. మే 2న సీఎం ప్రైవేటు సెక్రెటరీగా నియమించారని తెలిపారు.ఇందుకు సంబంధించి జీఓ సీక్రెట్ గా ఉంచి.. లక్షన్నర జీతం ఇస్తున్నారని.. తెలంగాణ ప్రజల సొమ్మును బయటివాళ్లకు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.సొంత రాష్ట్రంలో ఉద్యోగాలు భర్తీ చేయని కేసీఆర్.. పక్క రాష్ట్రంలో వాళ్ళను తెచ్చి పెట్టుకుంటున్నారని మండిపడ్డారు.పరాయి రాష్ట్రంలో పరపతి పెంచుకునేందుకు.. కిరాయి మనుషులను తెచ్చి పెట్టుకుంటున్నారని ఎద్దేవ చేశారు.టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చి.. పార్టీ విస్తరణకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఎవరి సొమ్మని శరద్ మడ్కర్ కు ఏడాదికి 18లక్షలు జీతం ఇస్తున్నారని నిలదీశారు.తక్షణమే ఆ జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.









