AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

తన చితి తానే పేర్చుకుని..

కొడుకులకు భారమై.. పోషణ బరువై.. కుమారులను నొప్పించలేక.. ఓ తండ్రి తీసుకున్న నిర్ణయం కన్నీళ్లు పెట్టిస్తుంది. కొడుకుల తీరు నచ్చక.. తన సమస్య తానే అంతం చేయాలనుకుని.. మనస్తాపంతో ఓ తండ్రి ఆత్మాహుతికి పాల్పడ్డారు. తన చితి తానే పేర్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు.ఈ హృదయవిదారక ఘటన సిద్దిపేట జిల్లాలో చోటుచేసుకుంది.

హుస్నాబాద్‌ మండలం పొట్లపల్లిలో గ్రామానికి చెందిన వెంకటయ్యకు నలుగురు కుమారులు, కుమార్తె ఉన్నారు.కుమారుల్లో ఇద్దరు పొట్లపల్లిలో, ఒకరు హుస్నాబాద్ లో, మరొకరు కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం నవాబుపేటలో నివాసముంటున్నారు. వెంకటయ్య భార్య గతంలోనే చనిపోయింది. తనకున్న నాలుగు ఎకరాల భూమిని కుమారులకు పంచి ఇచ్చేశాడు వెంకటయ్య. కుమారులు వ్యవసాయ కూలీలుగా పనిచేస్తున్నారు. వెంకటయ్యకు వృద్ధాప్య పింఛన్ వస్తోంది. గ్రామంలోనే ఆయన పెద్ద కుమారుడు కనకయ్య వద్ద ఉండేవాడు. అయితే ఆయన పోషణ విషయంలో ఐదు నెలల క్రితం పెద్దమనుషుల సమక్షంలో పంచాయతీ జరిగింది. నెలకు ఒకరి చొప్పున నలుగురు కుమారులు వంతుల వారిగా పోషించాలని నిర్ణయించారు.

గ్రామంలో ఉంటున్న పెద్ద కుమారుడు కనకయ్య వద్ద వంతు పూర్తి కావడంతో నవాబుపేటలో ఉంటున్న కుమారుడి వద్దకు వెళ్లాల్సి ఉంది. సొంత ఊరు, ఇంటిని వదిలి అక్కడికి తాను వెళ్ళనని వెంకటయ్య చెప్పేవారు.అయినప్పటికీ భారంగా ఈ నెల 2వ తేదిన సాయంత్రం ఇంటి నుండి బయలుదేరిన వెంకటయ్య.. గ్రామంలో ఓ ప్రజాప్రతినిధి ఇంటికి వెళ్లి ఆ రోజు రాత్రి అక్కడే ఉన్నారు. అక్కడ తన బాధ వెళ్లగక్కారు. 3వ తేదీన నవాబుపేటలోని మరో కుమారుడి ఇంటికి వెళ్తానని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయారు. కానీ తర్వాత ఏ కుమారుడి ఇంటికి వెళ్లలేదు. వెంకటయ్య నవాబుపేటకు వెళ్లలేదని తెలుసుకున్న కుటుంబ సభ్యులు.. అతని కోసం వెతికారు. పరిసర ప్రాంతాలు, నవాబుపేట రోడ్డులో వెతికినా ఆచూకీ లభించలేదు. ఈ క్రమంలోనే గురువారం మధ్యాహ్నం పొట్లపల్లి గ్రామంలో ఎల్లమ్మ గుట్ట వద్ద మంటల్లో కాలిన స్థితిలో వృద్ధుడి మృతదేహం కనిపించింది.ఆ మృతదేహం వెంకటయ్య దేనని కుటుంబ సభ్యులు గుర్తించారు. ఘటనా స్థలంలో తాటికమ్మలను ఒకచోట కుప్పగా వేసి వాటికి నిప్పంటించి, అందులో దూకి ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిసింది.

కన్నీళ్లు దిగమింగుకుని, కష్టం అంటే ఏంటో తెలియకుండా, పిల్లలను కళ్లల్లో పెట్టుకుని చూసుకున్న తల్లిదండ్రులను.. ఆ కుమారులే గుండెలపై తన్నుతున్నారు. ఈ సమాజంలో ఇలాంటి ఘటనలు ఇంకా ఎన్ని చూడాలో. కనిపెంచిన తల్లిదండ్రులను.. పిల్లలు భారంగా భావించడం ఎప్పటికి ముగుస్తుందో.తల్లిదండ్రులకు ఒక భారంగా భావించకుండా..ప్రేమగా వారి బాధ్యత తీసుకునే రోజులు ఎప్పుడు వస్తాయో…

ANN TOP 10