దేశంలోని పలు ప్రాంతాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఓ వైపు ఎండలు మండుతుండగా.. అంతలోనే కుండపోత వర్షం కురుస్తోంది. దేశ రాజధాని ఢిల్లీ సహా తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కర్ణాటక తదితర ప్రాంతాల్లో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఢిల్లీలో బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు భారీ వర్షం కురిసింది.
ఇంతలోనే భారీ పొగ మంచు దేశ రాజధాని ప్రాంతాన్ని కమ్మేసింది. గురువారం ఉదయం ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు ఆవహించింది. దీంతో వాహనదారులు దారి కనిపించక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సాధారణంగా ఢిల్లీలో మే నెలలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. నగరంలో సగటు గరిష్ట ఉష్ణోగ్రత 39.5 డిగ్రీల సెల్సియస్‌గా ఉంటుంది. ఎండలు మండిపోయే మే నెలలో సాధారణంగా ఇటువంటి వాతావరణ పరిస్థితులు చాలా తక్కువ. గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉండటం.. పగటిపూట, రాత్రి ఉష్ణోగ్రతల మధ్య గణనీయమైన వ్యత్యాసం ఉండటంతో పొగమంచు ఏర్పడేందుకు అనుకూలమైన పరిస్థితులు ఏర్పడుతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.









