బీజేపీ చేరికల కమిటీ దూకుడు పెంచింది. పెద్దగా కేడర్ లేని ఉమ్మడి ఖమ్మం జిల్లాపై కాషాయపార్టీ కన్నేసింది. బలమైన నాయకుడు పొంగులేటిని పార్టీలో చేర్చుకునే దిశగా బీజేపీ అడుగులు వేస్తుంది.
మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఏ పార్టీలో చేరతారనే దానిపై కొంతకాలంగా సస్పెన్స్ కొనసాగుతుంది.అధికార బీఆర్ఎస్ పై అసంతృప్తితో ఉన్న పొంగులేటి.. బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా అడుగులు వేసిన సంగతి తెలిసిందే. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ గత నెలలో బీఆర్ఎస్ ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చాక ఆయన జాతీయ పార్టీలో చేరతానని ప్రకటనలు చేశారు. అయితే అది కాంగ్రెస్సా, లేక బీజేపీ నా అనేది క్లారిటీ లేదు.దీంతో పొంగులేటి తదుపురి నిర్ణయాలపై ఆయన అభిమానుల్లో, రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ కొనసాగుతుంది.
బీఆర్ఎస్ కు ఎలాగైనా బుద్ధి చెప్పాలని.. మళ్లీ తమ పట్టు నిరూపించుకోవాలని ఆరాట పడుతున్న కాంగ్రెస్.. పొంగులేటిని పార్టీలో చేర్చుకుని ఉమ్మడి ఖమ్మంను కంచుకోటగా మార్చుకోవాలనుకుంది. ఇందులో భాగంగానే రాహుల్ గాంధీ టీం పొంగులేటిని కలిశారు. అప్పుడు పొంగులేటి పెట్టిన షరతులకు ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నేతలైన భట్టి విక్రమార్క, రేణుకా చౌదరి అభ్యంతరం వ్యక్తం చేశారు.ఆ తర్వాత టీకాంగ్రెస్ నేతలు రేణుకా చౌదరి ఇంట్లో సమావేశమై.. పొంగులేటిని పార్టీలో చేరేలా చొరవ తీసుకోవాలని కోరారు.మరోవైపు పొంగులేటి మాత్రం కాంగ్రెస్ లో చేరతానని స్పష్టమైన ప్రకటన చేయలేదు.
ఇది ఇలా ఉండగా పొంగులేటిని ఎలాగైనా తమ గూటికి చేర్చుకోవాలని కాషాయదళం కసరత్తు చేస్తుంది.పొంగులేటిని పార్టీలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.ఈ క్రమంలోనే నేడు బీజేపీ టీం పొంగులేటి ఇంటికి వెళ్తుంది. చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్, ఎమ్మెల్యే రఘునందర్, మాజీ ఎంపీ కొండా విశ్వేశర్ రెడ్డి సహా.. మరికొందరు నేతలు పొంగులేటి ఇంటికి వెళ్తున్నారు.
మరి పొంగులేటితో బీజేపీ మంతనాలు ఫలిస్తాయా? పొంగులేటి కాషాయ గూటికి చేరేందుకు అంగీకరిస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది.









