AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

చనిపోయిందనుకున్న మహిళ.. సీపీఆర్‌తో బతికింది..

కానిస్టేబుల్ సమయస్ఫూర్తి ఓ నిండు ప్రాణాన్ని కాపాడింది. చనిపోయిందనుకున్న మహిళ ప్రాణాలతో తిరిగొచ్చేలా చేసింది. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని రాంనగర్ కాలనీలో చోటు చేసుకుంది. అత్తింటి వేధింపులు తట్టుకోలేక ఓ వివాహిత ఉరేసుకోగా.. ఆమె చనిపోయిందని కుంటుబంసభ్యులు భావించారు. అంతలో అక్కడికి వచ్చిన కానిస్టేబుల్ ఆమెకు సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడాడు.

వివరాల్లోకి వెళితే.. గద్వాల జిల్లాకు చెందిన కీర్తికి, నాగర్ కర్నూల్ చెందిన జగదీశ్‌కు 12 ఏళ్ల క్రితం పెళ్లైంది. వీరికి ఒక కుమారుడు.. కుతూరు ఉన్నారు. జగదీశ్ ఓ ప్రైవేటు జాబ్ చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. అయితే జిల్లా పరిషత్ కార్యాలయంలో పని చేసే జగదీశ్ తండ్రి విధుల్లో ఉండగానే ఏడేళ్ల క్రితం చనిపోయాడు. దీంతో కారుణ్య నియామకాల్లో భాగంగా తండ్రి ఉద్యోగం జగదీశ్‌కు వచ్చింది. ఏడాది క్రితం అతను జిల్లా పరిషత్ కార్యాలయంలో క్లర్క్‌గా విధుల్లో చేరాడు.

పెద్ద కొడుకు తండ్రి ఉద్యోగంలో చేరటంతో రెండో కమారుడు వెంకటేశ్‌కు ఇల్లు ఇవ్వాలని జగదీశ్ తల్లి పద్మ భావించింది. ఈ విషయంలో ఇద్దరు కొడుకుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఇల్లును చిన్న కుమారుడికి ఇవ్వటానికి జగదీశ్ భార్య కిర్తీ ఒప్పుకోవటం లేదు. ఈ క్రమంలో ఇంట్లో నుంచి వెళ్లిపోవాలని అత్త, మరిది గత కొంత కాలంగా కీర్తిని, జగదీశ్‌ను వేధిస్తున్నారు. ఈ అంశంపై నాలుగు నెలల క్రితం కీర్తి పోలీసులను ఆశ్రయించగా.. కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు.

అయినా వేధింపులు ఆగకపోవటంతో కీర్తి సోమవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుంది. వెంటనే ఘటనా స్థలానికి కానిస్టేబుల్ మల్లేశ్ చేరుకున్నాడు.
చనిపోయి ఎంతసేపు అయిందని కానిస్టేబుల్ మల్లేశ్ అత్తింటివాళ్లను అడిగారు. అర్ధగంట అయిందని వారు చెప్పడంతో.. కీర్తికి వెంటనే సీపీఆర్ చేశారు. ఆమెలో కదలిక రావటంతో వెంటనే జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ డాక్టర్లు సకాలంలో వైద్యం అందించడంతో కీర్తి ప్రాణాలు దక్కాయి.

ANN TOP 10