ఈ ఏడాది తెలంగాణ ఎంసెట్‌కు భారీగా దరఖాస్తులు పెరిగాయని ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా లింబాద్రి మాట్లాడుతూ.. ఈ ఏడాది ఎంసెట్ ప్రవేశ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఈ ఏడాది ఎంసెట్‌కు అదనంగా 50వేల దరఖాస్తులు వచ్చాయన్నారు. ఇప్పటికే 2లక్షలకు పైగా విద్యార్థులు హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారని పేర్కొన్నారు.
పెరిగిన దరఖాస్తుల నేపథ్యంలో పరీక్షా కేంద్రాలను పెంచుతున్నట్లు లింబాద్రి తెలిపారు. ఎంసెట్‌కు 28 కొత్తవి సహా మొత్తం 137 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. విద్యార్థులు నిర్ణీత సమయానికి పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి, ఆలస్యమైతే అనుమతించేది లేదని తెలిపారు. లాసెట్ ఒకే రోజు మూడు సెషన్స్‌లో నిర్వహిస్తామని, ఈసెట్ ఒకే పూటలో పూర్తి చేసేలా ఏర్పాట్లు చేసినట్లు చెప్పుకొచ్చారు. ఇక ప్రైవేట్ యూనివర్సిటీల బిల్లు ప్రాసెస్‌లో ఉందని చెప్పుకొచ్చారు.
ఇదిలా ఉంటే.. మే 10 నుంచి 14 వరకు ఎంసెట్ అగ్రికల్చర్, ఇంజినీరింగ్ పరీక్షలు జరగనున్నాయి. మే 10, 11న అగ్రికల్చర్, మెడికల్.. 12, 13, 14 తేదీల్లో ఇంజినీరింగ్ పరీక్షలు నిర్వహించనున్నారు.









