కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంకగాంధీ తెలంగాణ పర్యటనకు ముహూర్తం ఖరారు అయినట్లు తెలుస్తోంది. ఈ నెల 8న ప్రియాంకగాంధీ హైదరాబాద్ పర్యటనకు రానున్నట్లు సమాచారం. సరూర్‌నగర్ స్టేడియంలో జరగనున్న నిరుద్యోగ నిరసన సభలో ప్రియాంకగాంధీ పాల్గొననున్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఈ నెల 5 లేదా 6న ఈ సభ నిర్వహించాలని టీ కాంగ్రెస్ ముందుగా నిర్ణయం తీసుకుంది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ సభను 8వ తేదీకి వాయిదా వేశారు.
ప్రస్తుతం కర్ణాటక ఎన్నికల ప్రచారం హోరాహోరీగా జరుగుతోంది. ఈ నెల 8న అక్కడ ప్రచారానికి ఫుల్‌స్టాప్ పడనుంది. దీంతో కర్ణాటక నుంచి ఢిల్లీకి తిరిగి వెళ్లే సమయంలో ప్రియాంకగాంధీ హైదరాబాద్‌లో పర్యటించనున్నట్లు టీపీసీసీ వర్గాలు పేర్కొంటున్నాయి. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారంపై టీ కాంగ్రెస్ పోరాటం చేస్తోంది. అందులో భాగంగా జిల్లాల్లో నిరుద్యోగ నిరసన సభలు నిర్వహిస్తోంది. ఇటీవల నల్లగొండలో ఈ సభ నిర్వహించగా.. ఇప్పుడు సురూర్‌నగర్‌లో సభకు టీ కాంగ్రెస్ ఏర్పాట్లు చేస్తోంది.
ఈ సభలో ప్రియాంకగాంధీ పాల్గొననన్నట్లు సమాచారం. ఇవాళ టీపీసీసీ ముఖ్యనేతలతో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్‌రావు ఠాక్రే జూమ్ మీటింగ్ నిర్వహించనున్నారు.









