నగరంలో సెల్లార్ల తవ్వకాలపై నిషేధం..
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్‌ఎంసీ) కీలక నిర్ణయం తీసుకుంది. నగరవ్యాప్తంగా రానున్న వర్షాకాలంలో సెల్లార్ల తవ్వకంపై నిషేధం విధించింది. వర్షాకాలంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు జీహెచ్‌ఎంసీ ఈ నిర్ణయం తీసుకుంది. నగరంలోని నిర్మాణ స్థలాలను పరిశీలించి సెల్లార్లు తవ్విన నిర్మాణాలను గుర్తించాలని టౌన్ ప్లానింగ్ వింగ్‌కు జీహెచ్‌ఎంసీ ఆదేశాలు జారీ చేసింది. దీంతో సెల్లార్ల తవ్వకాలను అధికారులు గుర్తించి జాగ్రత్తలు తీసుకోనున్నారు.
భవనాల్లోని సెల్లార్లు, కొత్తగా తవ్వనున్న సెల్లార్ల తవ్వకాలపై జీహెచ్‌ఎంసీ ప్రత్యేక దృష్టి పెట్టింది. మాన్‌సూన్ ప్రారంభం నుంచి ముగిసేవరకు కొత్త సెల్లార్ల తవ్వకానికి అనుమతి నిరాకరిస్తున్నట్లు వెల్లడించింది. సెల్లార్ల దగ్గర భద్రతా ప్రమాణాలు పాటించకపోయినా, సెల్లార్లు తవ్వినా తక్షణమే నోటీసులు ఇవ్వాలని నిర్ణయించింది. సెల్లార్లు తవ్వి నిర్మాణం చేయని భవన యజమానులకు కూడా నోటీసులు ఇవ్వనుంది. నోటీసులకు స్పందించకుంటే నిర్మాణ అనుమతులు రద్దు చేయడం, బిల్డర్ల లైసెన్సులు రద్దు చేయడంతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని జీహెచ్‌ఎంసీ హెచ్చరికలు జారీ చేసింది.
సెల్లార్ తవ్వకాలు జరుగుతున్న స్థలాలను జీహెచ్‌ఎంసీ అధికారులు పరిశీలించనున్నారు. సెల్లార్ సెట్‌బ్యాక్‌లను సరిచూసుకోవడంతో పాటు బిల్డింగ్ ప్లాన్ ప్రకారమే సెల్లార్ నిర్మాణం జరుగుతుందా? లేదా? అనేది చూడనున్నారు. ఇప్పటికే తవ్విన సెల్లార్లలో నీళ్లు నిలిచిపోకుండా జాగ్రత్తలు తీసుకోవడం, రిటైనింగ్ వాల్ నిర్మాణం, బారికేడింగ్ వంటి వాటిని పరిశీలించనున్నారు. సెల్లార్లు నిర్మాణం చేయకపోతే వాటిని మూసివేసేలా చర్యలు చేపట్టనున్నారు. శిధిలాలు, కూల్చిన వ్యర్థాలను రీసైక్లింగ్ ప్లాంట్‌కు రావాణా చేసేలా చర్యలు తీసుకోవాలని జీహెచ్‌ఎంపీ ఆదేశించింది. భూమి జారిపోయే అవకాశం ఉన్న ప్రదేశాలపై ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని జీహెచ్‌ఎంసీ సూచించింది.









