AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

పేదలకు బీజేపీ వరాలు

కర్ణాటకలో మళ్లీ గెలిచి తమ సత్తా చాటాలనుకుంటున్న బీజేపీ.. అందుకు తగ్గట్టుగా వ్యూహాత్మకంగా ముందుకెళ్తుంది. ప్రధాని మోదీ సహా కేంద్రమంత్రులు, బీజేపీ అగ్రనేతలు ఇప్పటికే కర్ణాటకలో పీక్స్ లో ప్రచారం చేస్తున్నారు. ఇదిలా ఉండగా పోలింగ్ కు అతి తక్కువ సమయమే ఉండటంతో.. బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ చేసింది. ‘విజన్ డాక్యుమెంట్’ పేరిట బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మేనిఫెస్టో విడుదల చేశారు. ఇందులో నిరుపేదల కోసం బీజేపీ 16 ముఖ్యమైన హామీలను పొందుపరిచింది.

మళ్లీ అధికారంలోకి వస్తే యూనిఫార్మ్ సివిల్ కోడ్ అమలు చేస్తామని చెప్పింది.దారిద్ర్య రేఖకు దిగువన జీవిస్తున్న కుటుంబాలకు ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇవ్వనున్నట్టు ప్రకటించింది.వీటిని ఉగాది, వినాయక చవితి, దీపావళికి పంపిణీ చేస్తారు.అలాగే, దారిద్ర్య రేఖకు దిగువన జీవిస్తున్న వారి కోసం ‘పోషణ’ పథకం అమలు చేస్తామని,ఇందులో భాగంగా ప్రతిరోజూ అర లీటర్ నందిని పాలు ఇస్తామని హామీ ఇచ్చింది.ఎస్సీ, ఎస్టీ మహిళలకు ఐదేళ్ల కాలానికి రూ. పది వేల ఫిక్స్ డ్ డిపాజిట్ పథకాన్ని ప్రవేశ పెడుతున్నట్టు హామీ ఇచ్చింది.

మైసూర్‌లో అంతర్జాతీయ ప్రమాణాలతో దేశంలోనే అతిపెద్ద పునీత్ రాజ్‌కుమార్ ఫిల్మ్ సిటీని ఏర్పాటు చేస్తామని తెలిపింది. విశ్వేశ్వరయ్య విద్యా యోజన కింద ప్రభుత్వ పాఠశాలలను అప్‌గ్రేడ్ చేస్తామని వెల్లడించింది. వచ్చే ఐదేళ్లలో 200 చేపల పెంపకం ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటు చేస్తామని తన మేనిఫెస్టోలో పొందుపరిచింది. రాష్ట్రవ్యాప్తంగా నాణ్యమైన ఆహారాన్ని అందించడానికి ప్రతి మున్సిపల్ కార్పొరేషన్‌లోని ప్రతి వార్డులో ‘అటల్ ఆహార కేంద్రాన్ని’ ఏర్పాటు చేస్తామని బీజేపీ హామీ ఇచ్చింది.సమాజంలోని అన్ని వర్గాలకు చేరువయ్యే విధంగా తమ మేనిఫెస్టోను రూపొందించినట్టు బీజేపీ పేర్కొంది. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను దాదాపు నెరవేర్చినట్టు స్పష్టం చేసింది. 224 సీట్లున్న కర్ణాటక అసెంబ్లీకి ఈనెల 10న ఎన్నికలు జరగనున్నాయి. 13న ఫలితాలు వెలువడనున్నాయి. కాగా, కాంగ్రెస్, జేడీఎస్ లు తమ మేనిఫెస్టోలను ప్రకటించాల్సి ఉంది.

ANN TOP 10