తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కొత్త సచివాలయ ప్రారంభోత్సవం రేపే. ఇందుకోసం సర్కారు అన్ని ఏర్పాట్లు చేస్తోంది. దేశం మొత్తం ఆశ్చర్యపరిచేలా.. ఇంద్రభవనాన్ని తలపిస్తోన్న సమీకృత సచివాలయ భవనం.. అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తెలంగాణ ఆత్మగౌరవ సౌధంగా నిర్మితమైన ఈ సచివాలయ భవన నిర్మాణంపై ఇప్పుడు సరికొత్త పంచాయితీ తెర మీదికొచ్చింది. 28 ఎకరాల స్థలంలో.. సువిశాలంగా 10.52 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో మొత్తం 8 అంతస్తుల్లో సచివాలయాన్ని నిర్మించారు. 610 కోట్ల రూపాయల వ్యయంతో.. ఇండో- పర్షియన్- అరేబియన్ శైలితో పాచు.. దక్కన్ కాకతీయ స్టైల్‌లో ఈ భవనాన్ని ఆవిష్కరించారు. ముఖ్యంగా జాతీయ చిహ్నలను ప్రతిష్ఠించిన రెండు ప్రధాన గుమ్మటాలతో పాటు.. 34 చిన్న గుమ్మటాలతో ఈ సచివాలయాన్ని నిర్మించగా.. ఇప్పుడు అవే వివాదానికి కారణమవుతున్నాయి.
తెలంగాణ సాంస్కృతిక వారసత్వ ప్రతిబింబంగా సచివాలయ నిర్మాణం జరిగిందని అటు ప్రభుత్వం చెప్పుకుంటుంటే.. ప్రతిపక్ష బీజేపీ మాత్రం కీలక ఆరోపణలు చేస్తోంది. తెలంగాణ కొత్త సచివాలయంలో సాంస్కృతిక వైభవమేదీ? అని ప్రశ్నిస్తోంది. సచివాలయం భవనం.. మసీదు నిర్మాణాన్ని తలపిస్తోందని సంచలన ఆరోపణలు చేస్తోంది. నిర్మాణ శైలిలో మచ్చుకైనా తెలంగాణ వారసత్వం కన్పించట్లేదంటోంది. శాతవాహనులు, కాకతీయల సంస్కృతి ఎక్కడ అని నిలదీస్తోంది. 85 శాతం ఉన్న హిందువుల మనోభావాలను ప్రతిభింబించలేదని.. పార్లమెంట్ కంటే సచివాలయ నిర్మాణం రెండింతలు అని ఆరోపిస్తోంది. నిజా వారసత్వ చరిత్రకు నయా నిజాం తాపత్రయ పడుతున్నాండంటూ.. ఆక్షేపిస్తోంది. ఎంఐఎం సంతృప్తి కోసమే ఈ సచివాలయ నిర్మాణమా అంటూ బేజీపీ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించింది.
ఇదిలా ఉంటే.. బీజేపీ చేసిన కీలక ఆరోపణలకు అధికార బీఆర్ఎస్ పార్టీ ధీటుగా సమాధానం చెప్పింది. తెలంగాణ సచివాలయం దక్కన్ కాకతీయ శైలిలో, మనోహరమైన రీతిలో, భారీ డోములతో రూపుదిద్దుకున్న అద్భుత కట్టడమని.. తెలంగాణ చారిత్రక, సాంస్కృతిక వారసత్వానికి ప్రతిబింబంగా నిర్మాణం జరిగిందని స్పష్టం చేసింది.









