AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

సొంత ఎమ్మెల్యేల అవినీతిని ఒప్పేసుకున్నట్టేనా?

బీఆర్‌ఎస్‌ ఆవిర్భావ సభలో కేసీఆర్‌ మాటలే నిదర్శనం
సొంత ఎమ్మెల్యేల అవినీతిని సీఎం కేసీఆర్‌ బహిరంగంగా ఒప్పేసుకున్నారు.. బీఆర్‌ఎస్‌ ఆవిర్భావ సభలో కేసీఆర్‌ మాట్లాడిన తీరే ఇందుకు నిదర్శనం. ప్రతిపక్షాలు నాటి నుంచి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలపై చేస్తున్న తీవ్ర విమర్శలకు బలం చేకూరినట్లుయింది. అసెంబ్లీ ఎన్నికలు ముంగిట్లోకి వచ్చేసి.. మరో నాలుగైదు నెలల్లో ఎన్నికల షెడ్యూల్‌ విడుదలయ్యే అవకాశం ఉన్న వేళలో.. అధికారపక్ష అధినేత నోటి నుంచి ఆచితూచి అన్నట్లుగా మాటలు వస్తాయి. దీనికి భిన్నంగా సొంత పార్టీ నేతల అవినీతిపై బీఆర్‌ఎస్‌ పార్టీ ఆత్మీయ సమావేశంలో ఓపెన్‌ అయిపోయారు గులాబీ బాస్‌.

సొంత పార్టీ ఎమ్మెల్యేల అవినీతిపై సంచలన వ్యాఖ్యలు చేశారు సీఎం కేసీఆర్‌. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న దళిత బంధు పథకం అమలు అంశంపై సీఎం కేసీఆర్‌ సీరియస్‌ గా రియాక్టు అయ్యారు. దళిత బంధు పై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణల వేళ.. సొంత పార్టీ ప్రజాప్రతి నిధులకు లాస్ట్‌ వార్నింగ్‌ ఇచ్చారు.

తమ పార్టీ ఎమ్మెల్యేలు దళితబంధు పథకంలో డబ్బులు వసూలు చేస్తున్నారని.. తమ బంధువులకు ఇళ్లను కేటాయిస్తున్నారన్న విషయాన్ని విపక్షాలు ఆరోపిస్తున్న వేళ.. వారి వాదనకు బలం చేకూరేలా కేసీఆర్‌ నోటి నుంచి అదే తరహా మాటలు రావటం విశేషం. దళితబంధు పథకంలో డబ్బులు వసూలు చేసే ఎమ్మెల్యేల చిట్టా తన దగ్గర ఉందని.. ఆ ఎమ్మెల్యేలకు ఇదే లాస్ట్‌ వార్నింగ్‌ అంటూ చెప్పేశారంటున్నారు.

నేతల అనుచరులు డబ్బులు తీసుకుంటున్నా.. సదరు ఎమ్మెల్యేలదే బాధ్యతగా స్పష్టం చేశారు. డబుల్‌ బెడ్రూం ఇళ్ల విషయంలో పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అధినేత ఇచ్చిన వార్నింగ్‌ విషయంలో గులాబీ దళం ఎలా రియాక్టు అవుతుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ANN TOP 10