AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మద్యం మత్తులో వాచ్‌మెన్‌ను మూడో అంతస్తు నుంచి తోసివేత

బంజారాహిల్స్‌లో డ్యాన్సర్ల దారుణం..
బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధి ఇంద్రనాగర్‌లోని రాఘవ గెస్ట్ హౌస్ లాడ్జిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. లాడ్జి రూమ్‌లో ఉంటున్న నలుగురు వ్యక్తులు మద్యం మత్తులో వాచ్‌మెన్ యాదగిరిని మూడోవ అంతస్తు నుండి తోసేశారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వాచ్‌మెన్‌ను దగ్గరలోని ఆస్పత్రికి హుటాహుటిన హోటల్ సిబ్బంది తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ యాదగిరి మృతి చెందాడు.

ఈ నెల 20న చెన్నై నుండి మని, దిన, నరేష్, నాగరాజు అనే నలుగురు డాన్సర్లు షూటింగ్ నిమిత్తం హైదరాబాద్ వచ్చారు. బంజారాహిల్స్‌లోని రాఘవ గెస్ట్‌హౌస్ లాడ్జిలో కొద్దిరోజులుగా ఉంటున్నారు. రోజూ మద్యం సేవిస్తూ న్యూసెన్స్ చేస్తోన్నట్లు హోటల్ సిబ్బంది చెబుతున్నారు. ఈ క్రమంలో గొడవ చేయవద్దని వాచ్‌మెన్ యాదగిరి వారిని రోజూ ప్రశ్నిస్తూ వస్తున్నాడు. గురువారం రాత్రి కూడా నలుగురు వ్యక్తులు హోటల్ రూమ్‌లో ఫుల్లుగా తాగేసి గొడవ చేయడం స్టార్ట్ చేశారు. దీంతో గొడవ చేయవద్దని యాదగిరి వారిని హెచ్చరించాడు. ఈ సమయంలో మద్యం మత్తులో ఉన్న నలుగురు వ్యక్తులు క్షణికావేశంలో లాడ్జి మూడవ అంతస్తు నుండి యాదగిరి కిందకు తోసేశారు. ఈ ఘటనలో హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ యాదగిరి మృతి చెందాడు.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న బంజారాహిల్స్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. హొటల్‌లో ఘటన జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ కేసులో మని, దిన అనే ఇద్దరి నిందుతులను అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు నిందితులు నరేష్, నాగరాజు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. వారిద్దరిని కూడా పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. ప్రస్తుతం అదుపులోకి తీసుకున్న ఇద్దరు నిందితుల ఆధారంగా మిగతా ఇద్దరిని కూడా పోలీసులు త్వరలో అరెస్ట్ చేసే అవకాశముంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ANN TOP 10