AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

భర్తతో గొడవపడిన గంటల వ్యవధిలోనే..

ఆర్కే బీచ్‌లో యువతి మృతదేహం కేసులో కొనసాగుతున్న దర్యాప్తు
విశాఖపట్నం ఆర్కే బీచ్‌లో మంగళవారం అర్ధరాత్రి తీరానికి కొట్టుకువచ్చిన యువతి మృతదేహం కేసులో మిస్టరీ కొనసాగుతోంది. మృతురాలిని గురువెల్లి శ్వేత (24)గా పోలీసుల దర్యాప్తులో తేలింది. మరణానికి కొన్ని గంటల ముందే ఆమె ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. కాళీమాత ఆలయం ఎదురుగా ఉన్న బీచ్‌లో మృతదేహం ఇసుకలో కూరుకుపోవడం, శరీరంపై లోదుస్తులు మాత్రమే ఉండటంతో తొలుత పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ కేసులో శ్వేత కాల్ రికార్డింగ్స్, పోస్టుమార్టం రిపోర్టు కీలకంగా మారనున్నాయి.

శ్వేత కుటుంబీకుల స్వస్థలం శ్రీకాకుళం జిల్లా మూలపేట. తండ్రి చనిపోవడంతో తల్లి రమ విశాఖ రైల్వే ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఈ క్రమంలో ఏడాది క్రితం గాజువాక సమీపంలోని ఉక్కు నిర్వాసితకాలనీకి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ గురువిల్లి మణికంఠతో వివాహం జరిపించారు. ప్రస్తుతం శ్వేత ఐదు నెలల గర్భిణి. 15 రోజుల క్రితం ఆఫీస్‌ పనిపై భర్త మణికంఠ హైదరాబాద్‌ వెళ్లారు. అత్తమామలతో కలిసి ఉంటున్న శ్వేత మంగళవారం సాయంత్రం అత్తతో గొడవ పడినట్లు తెలుస్తోంది. ఆ తరువాత అత్తమామలు ఆసుపత్రి పనిమీద బయటకు వెళ్లారు.

అనంతరం శ్వేత తన భర్త మణికంఠతో ఫోన్లో చాలాసేపు మాట్లాడారు. ఫోన్‌ ఆపేసి ఇంటికి తాళాలు వేసి పక్కింట్లో అందజేసి రాత్రి 7.30 గంటల సమయంలో బయటకు వెళ్లినట్లు స్థానికులు తెలిపారు. కాసేపటి తర్వాత ఇంటికి వచ్చిన అత్తమామలు శ్వేత పక్కింట్లో ఇచ్చిన తాళాలు తీసుకుని ఇంటి తలుపులు తీశారు. ఇంట్లో శ్వేత తన భర్తనుద్దేశించి రాసిన లేఖ కనిపించింది. కోడలు ఇంటికి రాకపోవడంతో అత్తమామలు న్యూపోర్టు పోలీస్‌ స్టేషన్‌లో 12 గంటల ప్రాంతంలో ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత రెండు గంటలకే ఆర్కే బీచ్‌ ఇసుకలో ఓ యువతి మృతదేహం కూరుకుపోయి ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహం శ్వేతదే అని గుర్తించారు. అత్తింటి వేధింపులు తట్టుకోలేకే తన కూతురు చనిపోయిందని శ్వేత తల్లి రమాదేవి ఆరోపించారు.

ANN TOP 10