దేశమంతా తెలంగాణ తరహా అభివృద్ధి కోసమే బీఆర్‌ఎస్ రూపాంతరం చెందిందని, మారింది టీఆర్‌ఎస్ పేరు మాత్రమేనని.. జెండా, గుర్తు, డీఎన్‌ఏ మారలేదని మంత్రి కేటీఆర్ అన్నారు. సిరిసిల్లలో జరిగిన బీఆర్ఎస్ నియోజకవర్గ ప్రతినిధుల సభలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ కాలి గోటికి సరిపోయే నాయకులు తెలంగాణలో ఎవరూ లేరని తెలిపారు. ఒకరు మెదడు లేని బంటి, ఇంకొకరు పార్టీలు మారే చంటి.. వాళ్లను ప్రతిపక్షమని అంటారా అని బండి సంజయ్, రేవంత్ రెడ్డిలను ఉద్దేశించి అన్నారు. కేసీఆర్ నాయకత్వంలో తాము పని చేయడం పూర్వజన్మ సుకృతమన్నారు.కేసీఆర్ పాలనలో తెలంగాణలో ప్రతి గ్రామం ఆదర్శంగా మారిందన్నారు. దేశ జనాభాలో మూడు శాతం ఉన్న తెలంగాణకు 30 శాతం జాతీయ అవార్డులు వచ్చాయన్నారు. ఇదంతా సీఎం కేసీఆర్ ప్రారంభించిన పల్లె ప్రగతితోనే సాధ్యమైందని చెప్పారు.22 ఏళ్ల క్రితం హైదరాబాద్ జలదృశ్యంలో టీఆర్ఎస్‌గా ఆవిర్భవించిన పార్టీ, ఇప్పుడు బీఆర్ఎస్ అయిందన్నారు. ఈ సందర్భంగా 60 లక్షల మంది గులాబీ దండుకు పేరుపేరున ధన్యవాదాలు తెలిపారు.









