ప్రజల కోసం పోరాడే వ్యక్తిని, ప్రజల కోసం ప్రశ్నించే వ్యక్తిని తెలంగాణ ప్రభుత్వం అణచివేస్తోందని వైఎస్ విజయమ్మ మండిపడ్డారు. పోలీసులపై దాడి కేసులో అరెస్టై చంచల్ గూడ జైలులో ఉన్న ఆమె కుతూరు, వైఎస్సాఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను ఆమె పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన విజయమ్మ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. పోలీసుల అత్యుత్సాహాన్ని, ప్రభుత్వ అలసత్వాన్ని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. షర్మిల ఇలాంటి అరెస్టులకు భయపడే వ్యక్తి కాదని అన్నారు.
“షర్మిల ప్రజల కోసం 3800 కిలో మీటర్లు పాదయాత్ర చేసింది. ప్రభుత్వాన్ని 30 లక్షల మంది నిరుద్యోగుల కోసం ప్రశ్నిస్తుంది. గ్రూప్స్, పదో తరగతి పరీక్ష పేపర్లు లీక్ అవుతుంటే అడగటం తప్పా ?. షర్మిల సిట్‌కు ఒంటరిగా వెళ్లి ప్రశ్నిస్తే ఎందుకు అడ్డుకున్నట్లు ? ఆమె క్రిమినలా ? టెర్రరిస్టా ? ప్రభుత్వం పిల్లల జీవితాలతో ఆడుకుంటుంది. అందుకే నిరుద్యోగుల సమస్యలపై షర్మిల పోరాటం చేసింది. కాంగ్రెస్, బీజేపీ పార్టీల సమావేశాలకు అనుమతులు ఇచ్చి షర్మిలను మాత్రం ఎందుకు ఇంట్లోంచి బయటకు రానివ్వడం లేదు ? ప్రశ్నించే గొంతుకల్ని అరెస్టులు చేయడం న్యాయమేనా ? ఇదేనా ప్రభుత్వ విధానం ? ప్రభుత్వం ప్రతిపక్షాలపై తన తీరు మార్చుకోకపోతే ప్రజలు, నిరుద్యోగులు సరైన సమాధానం చెబుతారు. షర్మిల మళ్లీ బెయిల్‌పై విడుదల అవుతుంది. ప్రజలు, నిరుద్యోగుల కోసం పోరాడుతుంది. ప్రజలు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నా.” అని వైఎస్ విజయమ్మ వ్యాఖ్యానించారు.









