AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

టీఎస్‌పీఎస్‌సీ పరీక్షలు రద్దు సబబే.. తెలంగాణ హైకోర్టు

టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నాపత్రాల లీకేజ్‌ వ్యవహారంలో పరీక్షలను రద్దు, వాయిదా వేయడం సబబేనని తెలంగాణ హైకోర్టు అభిప్రాయపడింది. లీకేజీ కేసు వ్యవహారంలో కాంగ్రెస్‌ నేత బల్మూరి వెంకట్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై ఉన్నత న్యాయస్థానంలో విచారణ జరిగింది. సిట్‌ దర్యాప్తు సరిగా జరగడం లేదని పిటిషనర్‌ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. పేపర్‌ లీకేజీ దర్యాప్తుని సీబీఐకి ఇవ్వాలన్న కాంగ్రెస్‌ పిటిషన్‌పై విచారణను ఈనెల 28కి వాయిదా వేసింది హైకోర్టు.

అదే రోజున తమ తీర్పుని ప్రకటిస్తామని తెలిపింది. అంతకుముందు ఈ అంశంపై ఇరువర్గాలు వాడివేడి వాదనలు వినిపించాయి. సిట్ దర్యాప్తు రాజకీయ నాయకుల ఒత్తిడితో జరుగుతోందని కాంగ్రెస్‌ అడ్వకేట్‌ వాదించారు. పేపర్ లీక్ ద్వారా NRIలు కూడా లబ్ది పొందారని ఆరోపించారు. ఝార్ఖండ్, అరుణాచల్, మధ్యప్రదేశ్‌లో లీకేజీ ఘటనలను CBIకి అప్పగించారని గుర్తుచేశారు. కేసు దర్యాప్తు చేస్తున్న సిట్ చీఫ్ పైనే కేసు ఉందన్నారు.. అటువంటి వ్యక్తికి దర్యాప్తు బాధ్యతలు ఎలా ఇస్తారని ప్రశ్నించారు.

పేపర్ లీకేజీ చాలా రాష్ట్రాల్లో జరుగుతూనే ఉందన్నారు ఏజీ. ఇప్పటికే దర్యాప్తు నివేదికను కోర్టుకు సమర్పించామని చెప్పారు.. నెలన్నర రోజులైనా దర్యాప్తు ఎందుకు ఆలస్యం అవుతోందని ప్రశ్నించింది హైకోర్టు. TSPSCలో పనిచేస్తూ పరీక్ష రాసిన వారినందరినీ గుర్చించాలని ఆదేశించింది. అవసరమైతే హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ సీపీల సహకారం తీసుకోవాలని సూచించింది.. తదుపరి విచారణను ఏప్రిల్ 28కి వాయిదా వేసింది.

ANN TOP 10