ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన మక్తల్ మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి తీవ్ర విషమంగా మారింది. గత కొంతకాలంగా ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతుండగా.. ఇప్పుడు ఆరోగ్యం మరింత విషమించింది. దీంతో పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఆయనను పరామర్శిస్తున్నారు. ఆయన ఇంటికి స్వయంగా వెళ్లి ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీస్తున్నారు. దయాకర్ రెడ్డి భార్య సీతా దయాకర్ రెడ్డిని అడిగి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకుంటున్నారు.
నెల రోజుల పాటు హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో దయాకర్ రెడ్డి చికిత్స పొందారు. అనంతరం ఆదివారం మహబూబ్‌నగర్ జిల్లాలోని చిన్నచింతకుంట మండలంలోని తన స్వగ్రామమైన పర్కపురంకు ఆయనను తీసుకొచ్చారు. ఇంట్లోనే వెంటిలేటర్‌పై ఆయన ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం కదల్లేని స్థితిలో దయాకర్ రెడ్డి ఉన్నారు. ఆయన ఆరోగ్యం క్షీణిస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా మారడంతో దయాకర్ రెడ్డి అనుచరులు, అభిమానుల్లో ఆందోళన నెలకొంది. ఆయన కోలుకోవాలంటూ అభిమానులు పూజలు నిర్వహిస్తున్నారు. దయాకర్ రెడ్డి కోలుకుని తిరిగి రావాలంటూ కోరుకుంటున్నారు.









