రేవంత్ వ్యాఖ్యలకు ఈటల స్ట్రాంగ్ కౌంటర్
రూ.25 కోట్ల వ్యవహారానికి సంబంధించి భాగ్యలక్ష్మి టెంపుల్ వద్ద టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు మాజీ మంత్రి, హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కౌంటర్ ఇచ్చారు. తాను రేవంత్ రెడ్డి పేరు ఎక్కడా ప్రస్తావించలేదని, వీరుడు ఎప్పుడూ కన్నీళ్లు పెట్టడన్నారు. రేవంత్ రెడ్డికి, తనకు పోలిక ఏంటి? అని ఈటల ప్రశ్నించారు. నోటుకు ఓటు కేసులో రేవంత్ రెడ్డి జైలుకు వెళ్లారని, ప్రజల కోసం పోరాడి ఆయన జైలుకు వెళ్లలేదని ఈటల వ్యాఖ్యానించారు.
‘నేను రాజకీయంగా మాట్లాడాను. అమ్మతోడు, అయ్యతోడు, అమ్మవారి తోడు అంటూ మాట్లాడటం పార్టీల కల్చర్ కాదు. విమర్శలకు సమాధానం చెప్పకుండా సంస్కారం లేకుండా మాట్లాడారు. రేవంత్ నీతిమాలిన వ్యాఖ్యలు చేస్తున్నారు. రేవంత్ సమస్యలపై పోరాడుతాడనుకున్నా.. ఏడుస్తాడనుకోలే. మీరు ఓటుకు నోటు కేసులో జైలుకు వెళ్లారు. మీతో మాకు పోలికా?’ అంటూ ఈటల కౌంటర్ ఇచ్చారు.
‘మునుగోడులో రాజగోపాల్ రెడ్డిని ఓడించేందుకు చేయాల్సిన కుట్రలన్నీ అప్పుడు చేశారు. ఆ బాధతోనే ఆయన ఏడ్చినట్లున్నారు. కాంట్రాక్టర్ లేదా బిల్డర్‌ను తాను బ్లాక్‌మెయిల్ చేసినట్లు నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తా.. ఆర్టీఐ పేరుతో బ్లాక్ మెయిల్ చేసేందుకు ఓ ఆఫీస్‌నే పెట్టుకున్న చరిత్ర నీది. నేను విద్యార్థి నేతగా ఉన్నప్పటి నుంచి పోరాటం చేస్తున్నా. ఇప్పటివరకు ఏ రాజకీయ నాయకుడి గురించి అసభ్యకరంగా మాట్లాడలేదు. నేను ఏ రాజకీయ నేత గురించి తప్పుగా మాట్లాడలేదు. రేవంత్ రెడ్డి కన్నీళ్లు పెట్టుకుంటూ కూడా అసభ్యకరంగా మాట్లాడారని ఈటల పేర్కొన్నారు.









