AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మెట్రో ప్రయాణికులకు శుభవార్త.. ఇప్పట్లో ఛార్జీల పెంపు లేనట్లే!

హైదరాబాద్ మెట్రోలో దాదాపు రోజుకు నాలుగున్నర లక్షలకు పైగా ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. సమ్మర్ సీజన్‌లో ప్రయాణికులు ఏసీ ప్రయాణాలకు మెుగ్గుచూపుతుండటంతో ఇటీవల రద్దీ పెరిగింది. అయితే ఏఫ్రిల్ 1 నుంచి హైదరాబాద్ మెట్రో పలు ఆఫర్లను ఎత్తివేసింది. ఇంతకు ముందు క్యూఆర్ కోడ్ టికెట్లపై 10 శాతం డిస్కౌంట్ ఆఫర్ ఉండగా.. ఇప్పుడు డిస్కౌంట్ ఆఫర్‌ను ఎత్తేసింది. కేవలం ఉదయం 6 నుంచి 8 గంటల వరకు రాత్రి 8 నుంచి అర్థరాత్రి వరకు మాత్రమే ఆ ఆఫర్‌ను వర్తింప జేస్తుంది. ఇక వీకెండ్ డేస్‌లో సూపర్ సేవర్ కార్డు ధర అంతకు ముందు రూ. 59 ఉండగా.. దాన్ని రూ.99కి పెంచింది.

ఇదిలా ఉండగా.. మెట్రో ఛార్జీల పెంపు ఉంటుందని గత కొంత కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే పెంపుపై ఫెయిర్‌ ఫిక్సేషన్‌ కమిటీని ఏర్పాటు చేసిన మెట్రో అధికారులు కేంద్రానికి నివేదికను పంపారు. అయితే మెట్రో ఛార్జీల పెంపుపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మెట్రో రైల్‌ ఛార్జీలను పెంచాలన్న ఎల్‌అండ్‌టీ హైదరాబాద్‌ మెట్రో సంస్థ విజ్ఞప్తిని రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించినట్లు సమాచారం. ఛార్జీల పెంపుపై ప్రభుత్వంపై అనేకసార్లు ఒత్తిడి వచ్చింది. కానీ ఎల్‌అండ్‌టీతో చేసుకున్న ఒప్పందం మేరకు ప్రస్తుతం ఉన్న కోచ్‌ల సంఖ్య పెంచకపోవడం పట్ల ప్రభుత్వం తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. దాంతో పాటు స్టేషన్లలో పూర్తిస్థాయి మౌలిక వసతులను కల్పించడంలో కూడా ఎల్‌అండ్‌టీ విఫలమైనట్లు అధికారులు భావిస్తున్నారు. ఈ రెండింటి విషయంలో ఎల్అండ్‌టీ ముందుకొచ్చే వరకు టిక్కెట్‌ రేట్లను పెంచే ఉద్దేశం లేదని ప్రభుత్వం స్పష్టం చేసినట్లు సమాచారం.

ANN TOP 10