రేవంత్ అడుగుపెడితే భాగ్యలక్ష్మీ వారి ఆలయం అపవిత్రమవుతుందని బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ విమర్శించారు.రేవంత్ రెడ్డి రూ.10 కోట్లు తీసుకున్నారని కాంగ్రెస్ నేతలే అంటున్నారని రాజగోపాల్ రెడ్డి తెలిపారు.ఓటుకు నోటు కేసులో రేవంత్ అడ్డంగా దొరికిపోయారని అన్నారు. హైదరాబాద్ లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న రాజగోపాల్ రెడ్డి.. రేవంత్ పై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ హైకమాండ్‌కి డబ్బులు ఇచ్చి రేవంత్ రెడ్డి పీసీసీ పదవి కొనుకున్నారని ఆరోపించారు.తాను, ఈటల రాజేందర్ రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లామని.. కానీ రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్‌లో చేరారన్నారు.
రేవంత్‌కి బ్లాక్ మెయిలర్ అనే పేరుందని.. రేవంత్‌రెడ్డి పదవులను అడ్డుపెట్టుకుని వేల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు.మునుగోడులో తనను ఓడించేందుకు బీఆర్ఎస్తో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నది వాస్తవం కాదా అని నిలదీశారు.రూ.18 వేల కోట్లకు అమ్ముడుపోయానని తనపై తప్పుడు ప్రచారం చేశారని.. ఆ ఆరోపణలను రుజువు చేయకపోతే రేవంత్ సంగతి కోర్టులో తేలుస్తానని చెప్పారు.ఎప్పటికైనా రేవంత్ జైలుకెళ్లడం ఖాయమని స్పష్టం చేశారు.









