వరంగల్ కేఎంసీ వైద్యవిద్యార్థి ప్రీతిది ఆత్మహత్యేనని వరంగల్ సీపీ రంగనాథ్ వెల్లడించిన సంగతి తెలిసిందే.మెడికో ప్రీతి మృతి కేసుపై శుక్రవారం వరంగల్ పోలీస్ కమిషనరేట్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రీతి మరణానికి సంబంధించిన పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చిందని, అందులో ‘డెత్ డ్యూ టు పాయిజన్’ అని తేల్చినట్లు వెల్లడించారు.పోలీసుల విచారణలోనూ దాదాపు అదే విషయం తేలిందని సీపీ చెప్పారు.
అయితే ప్రీతి మరణంపై ఆమె కుటుంబ సభ్యులు మొదటి నుంచి అనుమానాలు వ్యక్తం చేస్తున్న విషయం విదితమే. ప్రీతి ఆత్మహత్యే చేసుకుందని వరంగల్ సీపీ ప్రకటించడంపై కూడా ఆమె తల్లిదండ్రులు సందేహ పడ్డారు.ఈ క్రమంలో వారు వరంగల్ సీపీని కలిశారు. అనంతరం ప్రీతి తండ్రి నరేందర్ మీడియాతో మాట్లాడారు. సీపీతో మాట్లాడి అనుమానాలు నివృత్తి చేసుకున్నామని.. ప్రీతిది ఆత్మహత్యేనని నమ్ముతున్నామని చెప్పారు.ప్రీతి ఆత్మహత్యకు ఉపయోగించిన సిరంజి దొరికిందని.. ఆమె శరీరంలో విష పదార్థాలు ఉన్నాయని సీపీ చెప్పినట్లు వెల్లడించారు. ఈ విషయాలన్నీ పోస్టుమార్టం రిపోర్ట్ లో వచ్చాయని సీపీ చెప్పారన్నారు. కానీ రిపోర్ట్ ను మాత్రం తమకు చూపించలేదన్నారు. పోలీసుల దర్యాప్తు నిష్పాక్షికంగా జరుగుతుందని నమ్ముతున్నామని.. ఛార్జ్ షీట్ లో ఇంకా కొందరి పేర్లు చేరుస్తామని చెప్పారని వెల్లడించారు. ప్రీతి ఆత్మహత్య వెనుక కేఎంసీ ప్రిన్సిపాల్, అనస్థిషీయా విభాగం హెచ్ఓడిల బాధ్యతారాహిత్యం ఉందని తెలిపారు.









