సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం జరిగింది. పురిటినొప్పులతో వచ్చిన గర్భిణికి డెలివరీ చేయడంలో వైద్యులు జాప్యం చేయడంతో శిశువు మృతి చెందింది. రేణుక అనే గర్భిణి ఈ నెల 20న పురిటినొప్పులతో డెలివరీ కోసం ప్రభుత్వాస్పత్రికి వచ్చింది. ఆమెను పరీక్షించిన వైద్యులు నార్మల్ డెలివరీ చేస్తామని ఆపరేషన్ చేయమని తెలిపారు.
అయితే 24 గంటలు గడిచినప్పటికీ రేణుకకు నార్మల్ డెలివరీ అవ్వలేదు. చివరకు రేణుక పరిస్థితి విషమించడంతో డాక్టర్లు ఆపరేష్‌న్ చేసి శిశువుని బయటకు తీశారు. అయితే అప్పటికే మగ శిశువు మృతి చెందింది. రేణుక పరిస్థితి విషమంగా ఉండటంతో ఐసీయూ చికిత్స అందజేస్తున్నారు. శిశువు మృతి విషయం తెలిసిన రేణుక బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. డాక్టర్ల నిర్లక్ష్యంతోనే బాబు చనిపోయాడని బంధువులు ఆరోపించారు. ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు.









