ఆంధ్రప్రదేశ్లో రానున్న నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) హెచ్చరించింది. బంగాళాఖాతంలో కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వాతావరణంలో మార్పులు చోటుచేసుకోనున్నాయని వెల్లడించింది. బుధవారం 14 జిల్లాల్లో వర్ష సూచన ఉన్నట్లు తెలిపింది.
నైరుతి బంగాళాఖాతం నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు ద్రోణి కొనసాగుతున్న నేపథ్యంలో రానున్న నాలుగు రోజులు ఆకాశం మేఘావృతమై ఉంటుందని APSDMA మేనేజింగ్ డైరెక్టర్, RTGS సీఈవో ప్రఖర్ జైన్ తెలిపారు. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.
వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ముఖ్యంగా ఉరుములు, మెరుపులు సంభవించే సమయంలో చెట్ల కింద, విద్యుత్ స్తంభాల సమీపంలో ఉండకూడదని సూచించారు. వాతావరణ పరిస్థితులను గమనిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.








