AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

సుకుమార్ రైటింగ్స్‌లో కిరణ్ అబ్బవరం కొత్త సినిమా.. ‘రికార్డ్’ టైటిల్ పోస్టర్‌ వైరల్!

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం తన కెరీర్‌లో మరో కీలక అడుగు వేశారు. ‘క’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న ఆయన, తన 14వ చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ సుకుమార్‌కు చెందిన ‘సుకుమార్ రైటింగ్స్’ బ్యానర్‌లో ప్రారంభించారు. ఈ సినిమాకు ‘రికార్డ్’ (RECORD) అనే టైటిల్‌ను ఖరారు చేస్తూ మేకర్స్ విడుదల చేసిన పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ‘కొన్ని కథలు చెబుతారు.. మరికొన్ని రికార్డ్ అవుతాయి’ అనే క్యాప్షన్‌తో ఈ పోస్టర్‌ను విడుదల చేశారు.

‘పుష్ప’ చిత్రానికి పనిచేసిన వీర కోగటం ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. పోస్టర్‌లో ఎర్రటి చంద్రుడి నేపథ్యంలో కిరణ్ అబ్బవరం ఇంటెన్స్ లుక్‌లో కనిపిస్తున్నారు. ఆయన వెనుక గంటలు కట్టిన జంతువు తల కనిపించడం, పోస్టర్‌ను వీడియో కెమెరా రికార్డింగ్ స్క్రీన్ తరహాలో రూపొందించడం ఆసక్తికరంగా మారింది. దీంతో గ్రామీణ నేపథ్యంలోని రహస్యాలు, ఆచారాల చుట్టూ కథ సాగుతుందా? అనే చర్చ మొదలైంది. ‘A Mysterious World Unfolds!’ అనే ట్యాగ్‌లైన్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది.

ఈ చిత్రాన్ని వంశీ నందిపాటి ఎంటర్‌టైన్‌మెంట్, అశోక్ బండ్రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తుండగా, సుకుమార్ రైటింగ్స్ సమర్పిస్తోంది. పోస్టర్‌లో కిరణ్ అబ్బవరం పేరును ‘KIRAN ABBAVARAAM’ అని ప్రత్యేకంగా పేర్కొనడం కూడా అభిమానుల దృష్టిని ఆకర్షించింది. కథాంశానికి సంబంధించిన పూర్తి వివరాలను చిత్రబృందం ఇంకా వెల్లడించలేదు. విభిన్నమైన థ్రిల్లర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

ANN TOP 10