AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

చదువుకున్న యువత రాజకీయాల్లోకి రావాలి.. జేసీ ప్రభాకర్ రెడ్డి

చదువుకున్న యువత రాజకీయాల్లోకి రావాలన్నదే తన ప్రయత్నమని తాడిపత్రి మాజీ మున్సిపల్ చైర్మన్, టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా కాకుండా సమాజంలో మార్పు తీసుకువచ్చే పోరాటంగా భావిస్తానని తెలిపారు. తాడిపత్రి మున్సిపల్ కౌన్సిల్‌లోని 49 మందిలో 26 మంది బీటెక్, ఎంటెక్, డాక్టరేట్ పూర్తి చేసినవారే ఉన్నారని, తన కౌన్సిలర్లను చూసి గర్వపడుతున్నానని చెప్పారు. ఏడాదిలోగా మార్పు తీసుకురాలేకపోతే తమ సర్పంచులతో రాజీనామా చేయిస్తానని స్పష్టం చేశారు.

సర్పంచులు, వార్డు సభ్యులు ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించాలని జేసీ సూచించారు. ఉదయాన్నే వార్డుల్లో పర్యటించి కాలువలను శుభ్రం చేయించడం, పరిసరాల్లో చెత్త లేకుండా చూడటం వంటి పనులకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ప్రభుత్వ నిధులపైనే ఆధారపడకుండా గ్రామాలు, మున్సిపాలిటీల్లో సొంత ఆదాయ వనరులను పెంచుకోవాలని సూచించారు. ప్రజాసేవ చేయడానికి డబ్బు కంటే ధైర్యం, ఆసక్తి ముఖ్యమని పేర్కొన్నారు.

దౌర్జన్యాలు, వాహనాల దహనాలు, ఇంట్లో కూర్చుని నామినేషన్లు వేసే రోజులు పోయాయని జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. యూట్యూబ్‌ల ద్వారా ప్రచారం చేసుకోవడం కంటే నేరుగా ప్రజల్లోకి వెళ్లి వారి ఆదరణ పొందాలని సూచించారు. ప్రతి వార్డుకు సంబంధించిన పూర్తి సమాచారంతో పుస్తకాలు తయారు చేస్తున్నామని, వాటిని రాష్ట్రంలోని మేయర్లందరికీ పంపిస్తానని వెల్లడించారు. ప్రభుత్వం నిధులు కేటాయించినా, వాటిని సమర్థంగా వినియోగించి ప్రజలకు మంచి చేయడం ప్రజాప్రతినిధుల చేతుల్లోనే ఉందన్నారు.

ANN TOP 10