హైదరాబాద్‌లో జలమండలి గ్రీన్ ట్యాంకర్ల ద్వారా అందిస్తున్న నీటి సరఫరాపై వివాదం మొదలైంది. గార్డెనింగ్, ల్యాండ్‌స్కేపింగ్, నిర్మాణ అవసరాల కోసం శుద్ధి చేసిన మురుగు నీటిని అందించాలనే ఉద్దేశంతో ఈ సేవలను ప్రారంభించారు. అయితే ఖాజాగూడలోని ఓ నాలా నుంచి ఎలాంటి శుద్ధి ప్రక్రియ లేకుండానే మురుగు నీటిని నేరుగా గ్రీన్ ట్యాంకర్లలో నింపుతున్నారనే ఆరోపణలు వెలువడ్డాయి.
తాగునీటి అవసరాలకు కాకుండా ఇతర పనులకు శుద్ధి చేసిన మురుగు నీటిని వినియోగించాలనే లక్ష్యంతో జలమండలి నవంబర్ 1న ఈ సేవలను అధికారికంగా ప్రారంభించింది. ఎస్టీపీల్లో శుద్ధి చేసిన నీటిని ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయాల్సి ఉంటుంది. కానీ ఖాజాగూడలో నాలా నీటినే ట్యాంకర్లలో నింపుతున్నారన్న ఆరోపణలు రావడంతో నీటి సేకరణ ప్రక్రియపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
గ్రీన్ ట్యాంకర్లలో నింపుతున్న నీటిని ఎక్కడి నుంచి సేకరిస్తున్నారు? శుద్ధి చేసిన నీటికి బదులుగా మురుగు నీరు ఎలా సరఫరా అవుతోంది? ట్యాంకర్లలో నింపే నీటి నాణ్యతను ఎవరు పరీక్షిస్తున్నారు? నిరంతర పర్యవేక్షణ ఉందా? అనే ప్రశ్నలు తెరపైకి వచ్చాయి. ఈ ఆరోపణలపై జలమండలి అధికారులు స్పందించి, నీటి సరఫరా విధానంపై స్పష్టత ఇవ్వాల్సి ఉంది.








