AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

సుర్రుమంటున్న సూరీడు!

రాష్ట్రవ్యాప్తంగా రోజురోజుకు ఎండల తీవ్రత పెరుగుతోంది. భానుడి భగభగను తట్టుకోలేక జనం విలవిల్లాడుతున్నారు. ఉదయం 10 దాటిందంటే బయటకు రావడానికే జంకుతున్నారు. వాతావరణ శాఖ హెచ్చరించినట్లుగానే ఉష్ణోగ్రతలు 2 డిగ్రీలకుపైగా పెరిగాయి. కొన్ని జిల్లాల్లో 45 డిగ్రీలకు దగ్గరగా చేరాయి. ఆదివారం నిర్మల్‌ జిల్లా దస్తూరాబాద్‌లో అత్యధికంగా 44.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నల్గొండ జిల్లా కట్టంగూర్‌, ఆసిఫాబాద్‌ జిల్లా జంబుగలో 44.7, పెద్దపల్లి జిల్లా ఈసాల తక్కెళ్లపల్లి, ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో 44.4, జగిత్యాల జిల్లా గోధూరులో 44.3, సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో 44, ఆదిలాబాద్‌ అర్బన్‌లో 43.6, అదే జిల్లా అర్లిలో 43.4, మంచిర్యాల జిల్లా కొండాపూర్‌లో 43.4, యాదాద్రి జిల్లా యాదగిరిగుట్టలో 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.

23 జిల్లాల పరిధిలో 40 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వివరించింది. ఈ క్రమంలో నిర్మల్‌ జిల్లాలో అధికారులు ఆరెంజ్‌ అలెర్ట్‌ ప్రకటించారు. ఇటు రాత్రిపూట కూడా అన్ని జిల్లాల్లోనూ సగటున 23-25 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సోమవారం కూడా కొన్ని జిల్లాల్లో 41-45 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు రికార్డయ్యే అవకాశముందని.. అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మరోవైపు, రాగల ఐదు రోజులు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 డిగ్రీలు పెరిగే అవకాశముందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది.

ANN TOP 10