AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రంజాన్‌ వేళ.. పాతబస్తీ కళకళ

రంజాన్‌ సందర్భంగా భాగ్యనగరంలో కోలాహలం నెలకొంది. పాతబస్తీలో రద్దీ పెరుగుతోంది. పాతనగరంతో పాటు నగరంలోని పలు ప్రాంతాల్లో రంజాన్‌ షాపింగ్‌ సందడి నెలకొంది. మూడేళ్ల నుంచి కొవిడ్‌ ప్రభావంతో పండగ ఉత్సాహం అంతగా కనిపించకపోగా.. ఈ ఏడాది ముస్లిం వర్గాలు భారీ ఎత్తున సన్నాహాలు చేసుకుంటున్నారు. రంజాన్‌ మాసం చివరి దశకు చేరిన నేపథ్యంలో 24 గంటలూ మార్కెట్లు కళకళ లాడుతున్నాయి. చార్మినార్‌ పరిసర ప్రాంతాలతో పాటు నాంపల్లి, అఫ్జల్‌గంజ్‌, మలక్‌పేట్‌, కాచిగూడ, సికింద్రాబాద్‌, టోలీచౌకీ, మెహిదీపట్నం, దిల్‌సుక్‌నగర్‌, అమీర్‌పేట్‌ ప్రాంతాల్లో కూడా రంజాన్‌ కళ కనిపిస్తోంది.

ప్రత్యేక మార్కెట్లు కిటకిట
రంజాన్‌ సందర్భంగా పాతనగరంలోని మదీనా మార్కెట్‌ నుంచి పాతబస్తీ బస్తీల వరకు ఏర్పాటు చేసిన ప్రత్యేక మార్కెట్లు కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నాయి. చార్మినార్‌కు దీటుగా, పోటీగా ఇతర దుకాణాల్లో వస్త్రాలు, ఇతర సామగ్రి విక్రయిస్తున్నారు. దీంతో పాతబస్తీ వాసులు ఒకప్పుడు షాపింగ్‌ కోసం చార్మినార్‌కే వెళ్లేవారు. కొత్తగా వెలిసిన బస్తీ మార్కెట్లతో స్థానికులు చార్మినార్‌ మాత్రమే కాకుండా ప్రత్యామ్నాయ మార్కెట్లకు వెళుతున్నారు.

ఇటీవల తెలంగాణలో 24 గంటలపాటు వ్యాపారాలు కొనసాగించవచ్చు అనే నిబంధన నిజంగా వ్యాపారులకు ఈ రంజాన్‌ మాసంలో ఓ వరంలా మారింది. ఇక రంజాన్‌ మాసం చివరి వారంలో రద్దీ ఎక్కువ ఉంటుంది. 24 గంటల సదుపాయం తమకు ఉపయోగపడుతుందని.. ‘‘ప్రజలు తమ ప్రార్థనలకు భంగం కలగకుండా.. షాపింగ్‌ కోసం ఏ సమయంలోనైనా వచ్చేందుకు వీలు కల్పించినట్లు అయ్యిందని’’ అని ఓల్డ్‌ సిటీ ట్రేడర్స్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ అబిద్‌ మొహియుద్దీన్‌ చెప్పారు.

ANN TOP 10