AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రాజాసింగ్.. గోషామహల్ అభివృద్ధి ఏమైంది?:తలసాని

గత ప్రభుత్వాలు గోషామహల్ నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి చేయలేదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వంలో సమస్యలు ఉండవని.. సమస్యలు లేకుండా చేయడమే బీఆర్ఎస్ లక్ష్యమని తెలిపారు. గోషా మహల్ లో గన్ ఫౌండ్రిలో బీఆర్ఎస్ మాజీ కార్పోరేటర్ మమతా సంతోష్ గుప్తా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి పాల్గొన్నారు. గోషామహల్ లో గతంలో బీఆర్ఎస్ కార్పోరేటర్ అనేక నాళాలు, బస్తీ కమిటీ హాల్లు, మార్కెట్ లాంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారని మంత్రి చెప్పారు. ప్రస్తుతం ఉన్న బీజేపీ కార్పోరేటర్లు, బీజేపీ ఎమ్మెల్యే మతం పేరుతో రాజకీయం చేస్తున్నారని ఫైర్ అయ్యారు.

గోషామహల్ లో ఎన్నికలు అంటే చాలు.. దేశంలో ఉన్న బీజేపీ నాయకులు, కేంద్రమంత్రులు వస్తారని.. ఇక్కడ వారు ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. మోడీ ప్రభుత్వం హయాంలో దేశాన్ని అదానీ, అంబానీలకు తాకట్టు పెట్టారని విమర్శించారు. రాష్ట్రంలో, దేశంలో ఏదైనా సాహసం చేయాలంటే అది కేసీఆర్ తో మాత్రమే సాధ్యమవుతుందని చెప్పారు.బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచిన అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా.. ఆయనను స్మరించుకునేందుకు సీఎం కేసీఆర్ 125 అడుగుల అతి పెద్ద అంబేడ్కర్ విగ్రహం నిర్మించారని.. దీనిపై కూడా చేతకాని కాంగ్రెస్, బీజేపీలు లేనిపోని రాజకీయం చేయడం సిగ్గుచేటు అని విమర్శించారు.గోషామహల్ ప్రజలంతా ముఖ్యమంత్రి కేసీఆర్ వెంట ఉండాలని.. అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో కేసీఆర్ ప్రభుత్వం మీకు చూపిస్తుందని చెప్పారు. కార్యకర్తలందరూ పార్టీ బలోపేతానికి కృషి చేసి గోషామహల్ లో బీఆర్ఎస్ గెలుపుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ANN TOP 10