హైదరాబాద్ నుంచి ఇప్పటికే రెండు వందే భారత్ ట్రైన్లు అందుబాటులోకి రాగా.. త్వరలో మరో రెండు వందే భారత్ ట్రైన్ సర్వీసులను ప్రారంభించేందుకు రైల్వేశాఖ అధికారులు కసరత్తులు చేస్తున్నారు. హైదరాబాద్-బెంగళూరు, హైదరాబాద్-పూణె మధ్య వందే భారత్ ట్రైన్లను ప్రవేశపెట్టేందుకు రైల్వేశాఖ సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రక్రియ జరుగుతోంది. త్వరలోనే వీటిని ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
వచ్చే మూడు లేదా నాలుగు నెలల్లో ఈ రెండు వందే భారత్ ట్రైన్లు అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. ఈ రెండింటిలో ఒక ట్రైన్ కాచిగూడ-బెంగళూరు మధ్య ప్రయాణించనుండగా.. మరో ట్రైన్ సికింద్రాబాద్-పూణె మధ్య సర్వీసులు అందించనుంది. దక్షిణ మధ్య రైల్వేతో కలిసి భారతీయ రైల్వే ఈ రెండు సర్వీసులకు ప్లాన్ చేస్తోంది. హైదరాబాద్, బెంగళూరు సిటీలు దేశంలోనే పెద్ద ఐటీ హాబ్‌లుగా ఉన్నాయి. దీంతో ఈ రెండు సిటీల మధ్య రాకపోకలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి.









