నిరుద్యోగ సమస్య గురించి మాట్లాడే అర్హత బీజేపీకి లేదని.. నిరుద్యోగ మార్చ్ అని రాజకీయ మార్చ్ చేశారని విమర్శించారు ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్. హైదరాబాద్ లోని బీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీ నిరుద్యోగ మార్చ్ చేయాలనుకుంటే ఢల్లీి వీధుల్లో చేయాలని సూచించారు.ఎన్నికలు వచ్చినప్పుడు బీజేపీకి నిరుద్యోగులు గుర్తువస్తారని మండిపడ్డారు. లీకుల వీరులందరూ నిరుద్యోగుల గురించి మాట్లాడతున్నారని ఫైర్ అయ్యారు. అడ్డా మీద కూలీలను తీసుకు వచ్చి.. నిరుద్యోగ మార్చ్ అంటే ఎలా అని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ పాలనలో 35 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని తెలిపారు. ప్రశాంతగా ఉన్న రాష్ట్రంలో మతాల మధ్య చిచ్చు పెడుతున్నారని, నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నారని మండిపడ్డారు. మాది గాంధీ సిద్ధాంతం .. మీది గాడ్సే సిధ్ధాంతం అని వ్యాఖ్యానించారు.
పదే పదే బీజేపీ వాళ్లు కేసీఆర్ రాజీనామా చేయాలని అంటున్నారని.. ఎందుకు రాజీనామా చేయాలని ప్రశ్నించారు. దళిత బంధు, రైతుబంధు ఇస్తున్నందుకు రాజీనామా చేయాలా..? అని అడిగారు. బీజేపీ లీడర్లకు విభజన హామీలు మీద మాట్లాడే దమ్ము ఉందా అని నిలదీశారు. ఏ సంఘటన జరిగినా..బండి సంజయ్ భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గర ప్రమాణం చేయాలని అంటారని… మరీ రాష్ట్రంలో బీఆర్‌ఎస్ చేసిన అభివృద్ధిపై భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గరే చర్చకు వస్తామని.. కేంద్రంలో బీజేపీ చేసిన అభివృద్ధి గురించి చర్చకు వస్తారా అని సవాల్ విసిరారు.
రాష్ట్రంలో కుటుంబ పాలన కొనసాగుతుందని అంటున్నారని.. మరి దేశవ్యాప్తంగా జరుగుతుంది ఏంటని ప్రశ్నించారు. బీజేపీ మంత్రులు, వారి పిల్లలు అధికారంలో లేరా అని ప్రశ్నించారు. కార్యకర్తలను కుటుంబ సభ్యులుగా చూసుకునే పార్టీ బీఆర్‌ఎస్ అని తెలిపారు.కేసీఆర్ ముందు బీజేపీ కుప్పిగంతులు సాగవని… తెలంగాణ ప్రజలే కాకుండా దేశ ప్రజలందరూ బీఆర్‌ఎస్ వైపు చూస్తున్నారని చెప్పారు.









