ట్యాంక్ బండ్ వద్ద నిర్మించిన అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి తనకు ఆహ్వానం అందలేదని తమిళిసై తెలిపారు. ఆహ్వానం ఉంటే తప్పకుండా కార్యక్రమానికి హాజరయ్యేదాన్ని అని స్పష్టం చేశారు. అంబేద్కర్ ఎక్కువగా మహిళల హక్కుల గురించి మాట్లాడేవారని.. అలాంటిది ఓ మహిళా గవర్నర్‌ను కార్యక్రమానికి ఆహ్వానించకపోవటం ఆశ్చర్యంగా ఉందన్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి ఇన్విటేషన్ రాకపోయేసరికి.. రాజ్‌భవన్‌లోనే అంబేద్కర్ చిత్రపటానికి నివాళులు అర్పించినట్టు వివరించారు తమిళిసై.
దేశంలోనే ఎత్తైన అంబేద్కర్ విగ్రహం, అందులోనూ రాజ్యాంగ నిర్మాత విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమానికి గవర్నర్ తమిళిసైకి, ప్రతిపక్ష నేతలకు కనీసం ఆహ్వానం కూడా ఇవ్వకపోవటంపై ప్రభుత్వంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే.. చాలా కాలంగా రాజ్ భవన్‌కు ప్రగతి భవన్‌కు మధ్య దూరం పెరుగుతూ వస్తోంది. పలు అంశాల్లో ప్రభుత్వ తీరుపై గవర్నర్ తమిళిసై బహిరంగంగానే.. విమర్శలు చేయటం. అటు ప్రభుత్వం కూడా గవర్నర్ మీద పలు ఆరోపణలు చేసిన సందర్భాలు ఉన్నాయి. అదీ కాక.. పెండింగ్‌లో ఉన్న బిల్లులకు ఇప్పటికీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవటం చర్చనీయాంశంగా మారింది.









