మామిడికాయ లోడు లారీ బోల్తా..
ఊపిరాడక బాలుడి మృతి..
ఆ తల్లి తన కుమారుడికి అప్పుడే స్నానం చేయించింది. ఒళ్లు తుడవడానికి తువ్వాలు తెచ్చేందుకు ఇంట్లోకి వెళ్లింది. ఇంతలో ఓ లారీ వచ్చి కుమారుడిపై బోల్తా పడిరది. లోడు కింద పడి మూడేళ్ల బాలుడు ఊపిరాడక మృత్యువాత పడిన ఘటన పటమట లంక పరిధిలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. పటమటలంక స్క్రూబ్రిడ్జి ప్రాంతానికి చెందిన వెలిగింటి శివయ్య రోజువారీ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంటారు. ఇతనికి భార్య మల్లీశ్వరి, కుమారుడు సంజయ్(3). ఈ క్రమంలో రోజులానే మల్లీశ్వరి ఇంటి ఆరుబయట కుమారుడు సంజయ్కు స్నానం చేయించింది. తువ్వాలు తీసుకొచ్చేందుకు ఇంటి లోపలికి వెళ్లింది. ఆ సమయంలో మామిడికాయల లోడ్తో నూజివీడు నుంచి చిత్తూరు వెళ్తున్న లారీ శుక్రవారం రాత్రి 8.50 గంటలకు పైవంతెన నుంచి కిందకు దిగుతూ అదుపుతప్పి పటమటలంక వైపు స్కూబ్రిడ్జి కింద ఉన్న ఇళ్ల ముందు బోల్తా పడిరది. దీంతో అప్పుడే స్నానం చేసిన బాలుడు సంజయ్ అక్కడే ఉండడంతో లారీ కింద ఇరుక్కున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకున్నారు. లారీ కేబిన్లో ఇరుకున్న డ్రైవర్ హరిబాబుతో పాటు క్లీనర్ను బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. అనంతరం క్రేన్ల సాయంతో లారీని పక్కకు జరిపి చిన్నారిని బయటకు తీశారు. అపస్మారక స్థితిలో ఉండడంతో ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరిశీలించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. బాలుడి తల్లి రోదనలు మిన్నంటాయి.









