AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కొడాలి నాని సంచలన ఆరోపణలు.. డీఎస్సీ నియామకాల్లో భారీ అక్రమాలు జరిగాయంటూ విమర్శలు

కృష్ణా జిల్లా గుడివాడలో మాజీ మంత్రి కొడాలి నాని ఆధ్వర్యంలో డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు కూటమి ప్రభుత్వం అన్యాయం చేసిందని కొడాలి నాని ఆరోపించారు. డీఎస్సీ స్పోర్ట్స్ 3 శాతం కోటాలో భారీగా అవకతవకలు జరిగాయని ఆయన విమర్శించారు.

అర్హతలు, సంబంధిత సర్టిఫికెట్లు లేకపోయినా, పరీక్ష రాయకపోయినా కొందరికి ఉద్యోగాలు కల్పించారని కొడాలి నాని ఆరోపించారు. లోకేష్ నాయకత్వంలో జరిగిన డీఎస్సీ నియామక ప్రక్రియలో అక్రమాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయిందని విమర్శించారు. ఆటలు ఆడని వారికి కూడా స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగాలు ఇచ్చారని, ఉద్యోగం వచ్చిన తర్వాత బీఈడీ పూర్తి చేసే అవకాశం కల్పించడం నిబంధనలకు విరుద్ధమని ఆయన పేర్కొన్నారు.

డీఎస్సీ ప్రక్రియ ఎమ్మెల్యేను ముందుగా నియమించి, ఐదేళ్ల తర్వాత ఎన్నికలు నిర్వహించినట్లుగా సాగిందని కొడాలి నాని ఎద్దేవా చేశారు. పంజాబ్‌లో టీచర్ పోస్టుల విక్రయాల కేసును ప్రస్తావించిన ఆయన, అక్కడ జరిగిన ఘటనల కంటే ఏపీలో మరింత పెద్ద స్థాయిలో అక్రమాలు జరిగాయని ఆరోపించారు. డీఎస్సీ వ్యవహారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపడతామని ప్రకటించారు.

ANN TOP 10