మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం ‘కోరియన్ కనకరాజు’ సినిమా విడుదలకు సిద్ధమవుతున్నారు. ఆగస్టు 7న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వరుణ్ తేజ్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తన చెల్లి నిహారిక కొణిదెల నిర్మాతగా వ్యవహరిస్తున్న ‘బరి’ సినిమా కోసం ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్న సమయంలోనే తన కాలికి గాయమైందని తెలిపారు.
తన గాయం గురించి మాట్లాడుతూ.. ఆ సమయంలో సాధారణ పనులు చేసుకోవడం కూడా చాలా కష్టంగా మారిందని వరుణ్ తేజ్ చెప్పారు. లైట్ ఆన్ చేయడం, ఫ్యాన్ వేయడం, వాటర్ బాటిల్ తీసుకోవడం వంటి చిన్న చిన్న పనులకు కూడా ఇతరుల సహాయం అవసరమయ్యేదని తెలిపారు. అయితే ఈ గాయం కారణంగా తన కొడుకుతో ఎక్కువ సమయం గడిపే అవకాశం లభించిందని చెప్పారు. షూటింగ్స్‌తో బిజీగా ఉండటం వల్ల సాధారణంగా దొరకని సమయం ఇప్పుడు లభించడంతో, ఉదయం నుంచి రాత్రి వరకు కొడుకుతోనే ఎక్కువ సమయం గడుపుతున్నానని వెల్లడించారు.
తన భార్య లావణ్య త్రిపాఠి కూడా ఇంట్లో ఈ మార్పు గురించి మాట్లాడారని వరుణ్ తెలిపారు. ఇంట్లో ఇద్దరు పిల్లలను చూసుకోవడం కొత్త అనుభూతిని ఇస్తోందని ఆమె చెప్పినట్లు వెల్లడించారు. ఇంటి పనుల విషయంలో తాను సాధారణంగా తన పనులు తానే చేసుకుంటానని, శుభ్రత విషయంలో ఎక్కువ శ్రద్ధ చూపుతానని వరుణ్ చెప్పారు. కాలు విరగడం వల్ల షూటింగ్, రోజువారీ పనుల్లో ఇబ్బందులు ఎదురైనా.. ఆ సమయాన్ని కుటుంబంతో గడపడానికి ఉపయోగించుకున్నానని ఆయన పేర్కొన్నారు.









