AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బడ్జెట్‌లో బీసీల గొంతు కోశారు: రూ. 20 వేల కోట్ల హామీ ఏమైంది? – కాంగ్రెస్ ప్రభుత్వంపై గంగుల కమలాకర్ ధ్వజం!

తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026-27 వార్షిక బడ్జెట్ కేవలం అంకెల గారడీ తప్ప మరేమీ లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తీవ్రంగా విమర్శించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన ఆయన, ఈ బడ్జెట్‌లో వెనుకబడిన వర్గాలను (బీసీలను) ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని మండిపడ్డారు. ఎన్నికల ముందు బీసీల సంక్షేమానికి పెద్దపీట వేస్తామని చెప్పిన కాంగ్రెస్, ఇప్పుడు వారిని నిలువునా మోసం చేసిందని ఆయన ఆరోపించారు.

బీసీల సంక్షేమానికి రూ. 20 వేల కోట్లు కేటాయిస్తామని గతంలో హామీ ఇచ్చి, ప్రస్తుతం కేవలం రూ. 12,511 కోట్లు మాత్రమే కేటాయించడం బీసీల గొంతు కోయడమేనని గంగుల ఆగ్రహం వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బీసీ ఆత్మగౌరవ భవనాల కోసం కేటాయించిన భూములను కూడా ప్రస్తుత ప్రభుత్వం లాక్కునే ప్రయత్నం చేస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సంక్షేమ భవనాల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు సరికాదని ఆయన విమర్శించారు.

ప్రభుత్వం అసెంబ్లీ వేదికగా పచ్చి అబద్ధాలు చెబుతోందని, రేషన్ కార్డుల విషయంలో పొంతన లేని వ్యాఖ్యలు చేస్తోందని గంగుల కమలాకర్ విమర్శించారు. కల్యాణ లక్ష్మి పథకం కింద తులం బంగారం ఇస్తామని చెప్పి ఇప్పుడు ఆ ఊసే ఎత్తకపోవడం ప్రజలను వంచించడమేనని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల చెవిలో పువ్వు పెడుతోందని, ఈ బడ్జెట్ సామాన్యులకు మరియు బీసీలకు ఎటువంటి ఆశాజనకమైన ఫలితాలను అందించలేదని ఆయన స్పష్టం చేశారు.

ANN TOP 10