పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో ఆదివారం ఘోర విషాదం చోటుచేసుకుంది. స్వాత్ వ్యాలీలోని కబాల్ పట్టణంలో తీవ్రవాదానికి వ్యతిరేకంగా, శాంతిని కోరుతూ స్థానిక ప్రజలు నిర్వహించిన ర్యాలీపై ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటనతో ర్యాలీ ప్రాంగణంలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.
ఆత్మాహుతి దళ సభ్యుడు పేలుడు పదార్థాలతో ర్యాలీపై దాడి చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఐదుగురు పోలీసు అధికారులు సహా కనీసం 14 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 25 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
తీవ్రంగా గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాడికి పాల్పడిన వ్యక్తి, ఘటన వెనుక ఉన్న సంస్థకు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు భద్రతా అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.








