మహారాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేత, రాష్ట్ర అసెంబ్లీ మాజీ స్పీకర్ నానా పటోలే మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఆయన ఇద్దరు వ్యక్తులతో తన కాళ్లు కడిగించుకున్న దృశ్యాలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై ప్రతిపక్ష బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడంతో మహారాష్ట్ర రాజకీయాల్లో చర్చకు దారితీసింది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో నానా పటోలే ఓ సోఫాలో కూర్చొని ఉండగా, ఇద్దరు వ్యక్తులు ఆయన పాదాలను నీటితో కడిగారు. అనంతరం ఆయన పాదాలను తుడిచి, పువ్వులు, పండ్లు సమర్పించి నమస్కరించినట్లు వీడియోలో కనిపిస్తోంది. ఈ దృశ్యాలపై నెటిజన్ల నుంచి కూడా భిన్న స్పందనలు వ్యక్తమవుతున్నాయి.
ఈ వీడియోను ఆధారంగా చేసుకుని బీజేపీ నాయకులు నానా పటోలేపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ నేతల అహంకారానికి, వారి రాచరిక ధోరణికి ఈ ఘటన నిదర్శనమని కమలం పార్టీ నేతలు ఆరోపించారు. ఈ ఘటనపై నానా పటోలే నుంచి వివరణ రావాల్సి ఉండగా, వీడియో వెనుక ఉన్న పూర్తి సందర్భం ఏమిటన్నది కూడా చర్చనీయాంశంగా మారింది.








