తెలంగాణలో గృహ మరియు వాణిజ్య అవసరాల ఎల్పీజీ సిలిండర్ల తీవ్ర కొరతపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీకి ఆయన ఒక సమగ్రమైన లేఖ రాశారు. గ్యాస్ సరఫరా తక్షణమే పునరుద్ధరించకపోతే హైదరాబాద్ సహా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 90 శాతం హోటళ్లు, రెస్టారెంట్లు మరో 48 గంటల్లో మూతపడే ప్రమాదం ఉందని, దీనివల్ల సుమారు 80 లక్షల మంది దినసరి కూలీల ఉపాధి దెబ్బతింటుందని ఆయన లేఖలో పేర్కొన్నారు.
ఐటీ కారిడార్‌లోని పీజీ హాస్టళ్లలో నివసించే లక్షలాది మంది విద్యార్థులు, ఉద్యోగులు భోజనం దొరకక ఇబ్బందులు పడుతున్నారని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. గ్యాస్ కేటాయింపుల్లో పెద్ద సంస్థల కంటే వీధి వ్యాపారులు, తోపుడు బండ్ల వారికి ప్రాధాన్యతనిచ్చేలా వర్గీకరణ చేయాలని కోరారు. అలాగే, పీజీ హాస్టళ్లు మరియు గ్యాస్ ఆధారిత శ్మశాన వాటికలను ‘అవసర సేవలు’ (Essential Services) గా గుర్తించి, వాటికి నిరంతరాయంగా గ్యాస్ సరఫరా అందేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
గ్యాస్ లభ్యతపై నెలకొన్న అయోమయాన్ని తొలగించేందుకు జిల్లా స్థాయి పంపిణీ వివరాలతో కూడిన ‘పబ్లిక్ డాష్‌బోర్డ్’ను అందుబాటులోకి తేవాలని కేటీఆర్ సూచించారు. ఇదే సమయంలో గృహ అవసరాల సిలిండర్లను అక్రమంగా మళ్లిస్తూ అధిక ధరలకు అమ్ముతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గ్యాస్ కొరత కేవలం ఆర్థిక నష్టమే కాకుండా సామాన్య ప్రజల దైనందిన జీవితాలను అస్తవ్యస్తం చేస్తోందని, కేంద్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన క్షేత్రస్థాయిలో చర్యలు చేపట్టాలని కోరారు.








