AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

‘రుద్రాక్ష గర్ల్’ మోనాలిసా వివాహంపై దుమారం: ‘లవ్ జీహాద్’ ఆరోపణలపై దంపతుల ఘాటు స్పందన

2025 మహాకుంభమేళాలో రుద్రాక్షలు విక్రయిస్తూ దేశవ్యాప్తంగా పాపులర్ అయిన మోనాలిసా భోస్లే, తన ప్రియుడు ఫుర్మాన్ ఖాన్‌ను వివాహం చేసుకోవడం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. వేరే మతానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడంపై నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పిస్తూ, ఇది ‘లవ్ జీహాద్’ అంటూ ఆరోపణలు చేస్తున్నారు. కేరళలోని తిరువనంతపురంలో జరిగిన ఈ వివాహం తర్వాత ఆమెపై వస్తున్న నెగెటివ్ కామెంట్స్‌పై ఈ కొత్త జంట స్పందించింది.

ఈ వివాదంపై ఫుర్మాన్ ఖాన్ మాట్లాడుతూ.. తమ మధ్య ఉన్నది స్వచ్ఛమైన ప్రేమ మాత్రమేనని, దీనికి మతం రంగు పులమవద్దని కోరారు. తాము ఎవరి మతాలను వారు అనుసరిస్తామని, అన్ని మతాలను గౌరవిస్తామని, అన్నిటికంటే ముందు తాము మనుషులమని స్పష్టం చేశారు. మోనాలిసా కూడా స్పందిస్తూ.. ఆధ్యాత్మికతపై తనకున్న గౌరవం ఎప్పటికీ ఉంటుందని, వివాహం అనేది తన వ్యక్తిగత నిర్ణయమని వెల్లడించారు. ఈ వివాహం కేవలం ఇద్దరు వ్యక్తుల ఇష్టపూర్వక నిర్ణయమని వారు తేల్చిచెప్పారు.

మరోవైపు, మోనాలిసాను హీరోయిన్‌గా పెట్టి ‘మణిపూర్ ఫైల్స్’ అనే సినిమా తీస్తున్న దర్శకుడు ఈ పరిణామంపై విస్మయం వ్యక్తం చేశారు. ఆమె సనాతన ధర్మానికి ప్రతినిధిగా నిలుస్తుందని భావించి సినిమాలో అవకాశం ఇచ్చానని, అయితే ఆమె తీసుకున్న ఈ ఆకస్మిక నిర్ణయం తనను ఆశ్చర్యపరిచిందని పేర్కొన్నారు. సమాజంలో ఒక గుర్తింపు పొందిన వ్యక్తులు నిర్ణయాలు తీసుకునేటప్పుడు బాధ్యతగా ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఈ వివాదంపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ANN TOP 10