AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

“కలలో జరిగిన దాడిని నిజమనుకున్నా”: మైనర్ బాలిక మాట మార్చడంతో ఎయిర్ ఫోర్స్ ఉద్యోగి నిర్దోషిగా విడుదల

కలలో జరిగిన సంఘటనను నిజమని భ్రమపడి ఒక మైనర్ బాలిక ఇచ్చిన ఫిర్యాదు, భారత వైమానిక దళ (IAF) ఉద్యోగి జీవితాన్ని తలకిందులు చేసింది. ఏడేళ్ల సుదీర్ఘ న్యాయపోరాటం తర్వాత, “అత్యాచారం జరగలేదు.. అదంతా నా కల మాత్రమే” అని బాధితురాలు కోర్టులో వాంగ్మూలం ఇవ్వడంతో ఉత్తర ప్రదేశ్‌లోని ప్రత్యేక కోర్టు నిందితుడు అనురాగ్ శుక్లాను నిర్దోషిగా ప్రకటిస్తూ కేసును కొట్టివేసింది. ఒక అపార్థం వల్ల ఒక వ్యక్తి గౌరవం, వృత్తిపరమైన జీవితం ఎంతలా దెబ్బతింటాయనడానికి ఈ కేసు నిదర్శనంగా నిలిచింది.

2019 మార్చిలో కాన్పూర్‌లోని తన అక్క ఇంటికి వెళ్లిన 15 ఏళ్ల బాలిక, తన బావ అనురాగ్ శుక్లా తనపై అఘాయిత్యానికి ప్రయత్నించారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఆయనపై పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. అయితే, తాజాగా కోర్టు విచారణలో బాలిక మాట్లాడుతూ.. ఆ రాత్రి తాను యాంటీబయాటిక్స్ వేసుకోవడం వల్ల మత్తులో ఉన్నానని, ఆ సమయంలో తన బావ తనను తాకినట్లు కలలో అనిపించిందని వెల్లడించింది. ఆ భయంలో తాను వేసిన కేకలను చూసి కుటుంబ సభ్యులు కూడా అపార్థం చేసుకున్నారని వివరించింది.

కోర్టు అతడిని నిర్దోషిగా తేల్చినప్పటికీ, ఈ తప్పుడు ఆరోపణల వల్ల అనురాగ్ శుక్లా జీవితంపై తీవ్ర ప్రభావం పడింది. జైలు శిక్ష అనుభవించడమే కాకుండా, వైమానిక దళంలో రావాల్సిన ప్రమోషన్లు ఆగిపోయాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 2020లో రావాల్సిన ‘కార్పోరల్’ హోదా ఈ కేసు కారణంగానే నిలిచిపోయిందని, తన పరువు మంటగలిసిందని ఆందోళన వ్యక్తం చేశారు. చట్టం అతడిని విముక్తుడిని చేసినా, కోల్పోయిన కాలాన్ని మరియు గౌరవాన్ని తిరిగి పొందడం కష్టమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ANN TOP 10