ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను పూర్తిగా కుప్పకూల్చిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. తాడేపల్లిలో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన, ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అంకెలన్నీ మోసపూరితమని ఆరోపించారు. తాము ఐదేళ్లలో చేసిన అప్పుల కంటే, చంద్రబాబు కేవలం రెండేళ్లలోనే అధికంగా అప్పులు చేసి రాష్ట్రాన్ని కష్టాల్లోకి నెట్టారని విమర్శించారు.
కాగ్ (CAG) నివేదికల ప్రకారం కూటమి ప్రభుత్వం ఇప్పటికే రూ. 3.31 లక్షల కోట్ల అప్పులు దాటేసిందని, రాష్ట్ర జీఎస్‌డీపీ (GSDP) లో అప్పుల శాతం 5.089కి పెరిగిందని జగన్ గణాంకాలను వివరించారు. తాము అధికారంలో ఉన్నప్పుడు కోవిడ్ వంటి కష్టకాలంలో కూడా పరిమితి దాటలేదని, కానీ ప్రస్తుత ప్రభుత్వం విచ్చలవిడిగా అప్పులు చేస్తూ ట్రెజరీని ఖాళీ చేసిందని మండిపడ్డారు. ఏడాదిలో కేవలం 8 రోజులు మాత్రమే ట్రెజరీలో కనీస బ్యాలెన్స్ ఉందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చని ఎద్దేవా చేశారు.
రాష్ట్రంలో ‘దోచుకో.. పంచుకో.. తినుకో..’ అనే విధానం నడుస్తోందని, లిక్కర్ మాఫియా మరియు భూ దందాలు పెరిగిపోయాయని జగన్ ఆరోపించారు. విశాఖపట్నంలో రూ. 5 వేల కోట్ల విలువైన భూములను చంద్రబాబు తన బంధువులకు, రియల్ ఎస్టేట్ సంస్థలకు కట్టబెట్టారని తీవ్ర విమర్శలు చేశారు. సూపర్ సిక్స్ హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని, గత ప్రభుత్వ పథకాలను రద్దు చేస్తూ ప్రజలను వంచిస్తున్నారని ఆయన దుయ్యబట్టారు.








