AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఇప్పసారాతో తెలంగాణకు లక్ష కోట్ల ఆదాయం: అసెంబ్లీలో ప్రైవేట్ బిల్లు పెడతానన్న ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి ఇప్పపూల సారాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో అడవుల్లో సహజంగా లభించే ఇప్పపూలతో తయారు చేసే సారాను ఒక ‘గ్లోబల్ బ్రాండ్’గా మార్చాలని ఆయన ప్రతిపాదించారు. మంగళవారం జడ్చర్లలోని తన క్యాంప్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఇప్పసారాను తెలంగాణ సాంప్రదాయక మద్యాంగా గుర్తించడం వల్ల రాష్ట్ర ఖజానాకు సుమారు లక్ష కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతుందని, అదే సమయంలో గిరిజనులకు భారీగా ఉపాధి లభిస్తుందని పేర్కొన్నారు.

బ్రిటీష్ కాలం నాటి ఆంక్షల వల్ల ఇప్పసారా తయారీ ఆగిపోయిందని, విదేశాల్లో తయారు చేసే ‘టకీలా’ తరహాలోనే మన ఇప్పసారాను కూడా ప్రపంచవ్యాప్తంగా విక్రయించవచ్చని అనిరుధ్ రెడ్డి అభిప్రాయపడ్డారు. రసాయనాలతో తయారు చేసే కల్తీ సారాకు తాను వ్యతిరేకమని, కేవలం సహజసిద్ధమైన ఇప్పపూల సారా వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయని ఆయన చెప్పుకొచ్చారు. గతంలో ఇప్పసారా తాగిన వారు 100 ఏళ్లకు పైగా జీవించేవారని, ఇప్పుడు రసాయన మద్యం వల్ల యువత త్వరగా అనారోగ్యానికి గురవుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

బెల్ట్ షాపుల నివారణకు ఇప్పసారా ఒక ప్రత్యామ్నాయం అవుతుందని ఆయన తెలిపారు. ప్రస్తుతం ఉన్న ఎక్సైజ్ నిబంధనల వల్ల బెల్ట్ షాపులను అరికట్టడంలో కొన్ని సాంకేతిక ఇబ్బందులు ఉన్నాయని, ఈ అంశాలన్నింటిపై త్వరలోనే అసెంబ్లీలో మాట్లాడతానని స్పష్టం చేశారు. మీడియా తన వ్యాఖ్యలను తప్పుగా ప్రచారం చేస్తోందని, తాను కేవలం గిరిజనుల ఆర్థికాభివృద్ధి మరియు రాష్ట్ర ఆదాయం కోసమే ఈ ప్రతిపాదన చేస్తున్నానని ఎమ్మెల్యే వివరణ ఇచ్చారు.

ANN TOP 10