ఖమ్మం జిల్లా వెలుగుమట్ల భూ బాధితుల సమస్య పరిష్కారం కోరుతూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత చేపట్టిన నిరసన ఉత్కూంఠ రేపుతోంది. సోమవారం మధ్యాహ్నం ఖమ్మం జడ్పీ కూడలి వద్ద బాధితులతో కలిసి ఆమె భారీ ఎత్తున నిరసన చేపట్టారు. న్యాయం జరిగే వరకు కదిలేది లేదని రోడ్డుపైనే బైఠాయించడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించిపోయింది. దీంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. అయితే, సాయంత్రం విడుదలైన తర్వాత కూడా ఆమె వెనక్కి తగ్గకుండా పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేశారు.
పోలీస్ స్టేషన్ నుండి నేరుగా ఖమ్మంలోని అంబేడ్కర్ భవన్‌కు చేరుకున్న కవిత, అక్కడ నిరవధిక నిరాహార దీక్షకు దిగారు. భూదాన్ భూముల బాధితులకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేస్తోందని, పేదలకు పూర్తిస్థాయిలో న్యాయం జరిగే వరకు తన పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యంగా విమర్శలు గుప్పిస్తూ, పేదల భూమిని రక్షించుకోవడానికి ఎంతటి త్యాగానికైనా సిద్ధమని ప్రకటించారు. ఈ క్రమంలో మంగళవారం తెల్లవారుజామున పోలీసులు మెరుపుదాడి చేసి అంబేడ్కర్ భవన్‌లో దీక్ష చేస్తున్న కవితతో పాటు ఇతర నాయకులను అరెస్టు చేశారు.
వెలుగుమట్ల ప్రాంతంలోని భూదాన్ భూముల విషయంలో దశాబ్దాలుగా వివాదం నెలకొంది. తమకు కేటాయించిన భూములకు పట్టాలు రాకపోవడం, ఆ భూములు ఆక్రమణలకు గురికావడంపై బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యను మానవీయ కోణంలో చూడాలని డిమాండ్ చేస్తున్న కవిత, ప్రస్తుతం అరెస్టై హైదరాబాద్‌కు తరలించబడ్డారు. ఖమ్మంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ అరెస్టుతో రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ వాతావరణం వేడెక్కింది.








